ఎండో, వానో చెప్పుడే పెద్ద వ్యాపారమైంది

ఎండో, వానో చెప్పుడే పెద్ద వ్యాపారమైంది

బయటకెళ్లాలంటే వానొస్తుందా, ఎండ ఎక్కువ ఉంటుందా అనేది తెలుసుకునే ఇప్పుడు నగరాల్లోని వ్యక్తులు వెళ్తున్నారు. చేతిలో మొబైల్‌‌ ఫోనుంటే చాలు రాబోయే వారం రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలియచెప్పే యాప్స్‌‌ ఇప్పుడు బోలెడున్నాయి. ఇక పల్లెల్లో వానొస్తుందా రాదా అనేది ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. అది తెలుసుకోవడానికి టీవీ, రేడియోలపైనే ఎక్కువ మంది పల్లె ప్రజలు ఆధారపడుతున్నారు. వ్యవసాయం చేసే రైతులకు వెదర్‌‌ ఫోర్‌‌కాస్ట్‌‌ చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వెదర్‌‌ ఫోర్‌‌కాస్ట్‌‌ పెద్ద వ్యాపారమైపోయింది. వ్యవసాయంలోనే కాదు లాజిస్టిక్స్‌‌, ట్రాన్స్‌‌పోర్టు రంగాలలోనూ వెదర్‌‌ ఫోర్‌‌కాస్ట్ ప్రధానమే. వంద మిలియన్‌‌ డాలర్లకు చేరిన ఇండియా వెదర్‌‌ ఫోర్‌‌కాస్టింగ్‌‌ బిజినెస్‌‌ తీరుతెన్నులేంటో ఇప్పుడు చూద్దాం.

వెలుగు బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌ : వాతావరణ సూచనలు చేయడం ఇండియాలో మంచి వ్యాపారంగా మారుతోంది. ఇండియాలో ఈ మార్కెట్‌‌‌‌ విలువ 100 మిలియన్‌‌‌‌ డాలర్లకు చేరిందని అంచనా. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రైవేటు కంపెనీలు ఇందులో తమ వాటా కోసం పోటీపడుతున్నాయి. అగ్రికల్చర్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ రంగాలలో వాతావరణ సూచనలు కీలకం కావడంతో వాటికోసం ప్రభుత్వం ది వెదర్‌‌‌‌ కంపెనీ (డబ్ల్యూసీ) వంటి  ప్రైవేటు ఆపరేటర్ల మీదే ఆధారపడుతోంది. ఈ మూడు రంగాలలోనూ తమకు పెద్ద క్లయింట్లే ఉన్నారని డబ్ల్యూసీ ఇండియా హెడ్‌‌‌‌ హిమాంశు గోయెల్‌‌‌‌ చెప్పారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీని 2016 లో ఐబీఎం కొనేసింది. డబ్ల్యూసీ 178 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి 500 మీటర్ల రిజల్యూషన్‌‌‌‌తో  వెదర్‌‌‌‌ ఫోర్‌‌‌‌కాస్ట్‌‌‌‌ను కంపెనీ ఇష్యూ చేస్తుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు ఫోర్‌‌‌‌కాస్ట్‌‌‌‌నే ఇవ్వగలగడం ప్రత్యేకత.

ప్రెసిషన్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌లో ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఉపయోగించడానికి 2018 లో నీతి ఆయోగ్‌‌‌‌తో డబ్ల్యూసీ జట్టు కట్టింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు డేటా అందించడంతోపాటు, ఆన్‌‌‌‌–గ్రౌండ్‌‌‌‌ రిసెర్చ్‌‌‌‌నూ ఈ కంపెనీ నిర్వహిస్తోంది. వాతావరణానికి తగినట్లుగా సాగు టెక్నిక్స్‌‌‌‌ , పంటల మానిటరింగ్‌‌‌‌కు తగిన పద్ధతులు కనుగొనడంతోపాటు, క్రిమి, కీటకాల దాడులను అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ సాయంతో ముందుగానే కనుక్కోవడం వంటి బాధ్యతలను నీతి ఆయోగ్‌‌‌‌ ప్రాజెక్టు కింద డబ్ల్యూసీ చేపడుతోందని గోయెల్‌‌‌‌ వెల్లడించారు.

భారీ పెరుగుదలకు చాన్స్​

కచ్చితమైన వాతావరణ సూచనలు కీలకమవడంతో గ్లోబల్‌‌‌‌ వెదర్‌‌‌‌ ఫోర్‌‌‌‌కాస్టింగ్ సర్వీసెస్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ 2016 లోని 1.2 బిలియన్‌‌‌‌ డాలర్ల నుంచి 2023 నాటికి 2.7 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో వెదర్‌‌‌‌ ఫోర్‌‌‌‌కాస్టింగ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ కనీసం 100 మిలియన్‌‌‌‌ డాలర్లని, ఇది చాలా వేగంగా పెరుగుతోందని స్కైమెట్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌ జతిన్‌‌‌‌ సింగ్‌‌‌‌ చెప్పారు. వెదర్‌‌‌‌ ఫోర్‌‌‌‌కాస్టింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు అందించేందుకు 2003 లో స్కైమెట్‌‌‌‌ను నెలకొల్పారు. అగ్రికల్చర్‌‌‌‌, పవర్‌‌‌‌, ఆయిల్‌‌‌‌ అండ్ గ్యాస్‌‌‌‌, ఇన్సూరెన్స్‌‌‌‌, బ్యాంకింగ్‌‌‌‌ రంగాలలోని 20 క్లయింట్లకు ఫోర్‌‌‌‌కాస్ట్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ను స్కైమెట్‌‌‌‌ అందిస్తోంది. 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 12 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం 2019 నాటికి ఏకంగా రూ. 41 కోట్లకు చేరింది. ఈ రంగంలో ఒకటి, రెండు కంపెనీలే గట్టి పట్టు సాధించాయని అవే మార్కెట్‌‌‌‌ను శాసిస్తున్నాయనీ సింగ్‌‌‌‌ తెలిపారు. ఐతే, ట్రాపికల్‌‌‌‌ మెటిరాలజీపై వాటికెంత పట్టుందో తనకు అంతుపట్టలేదని వ్యాఖ్యానించారు.

మా సత్తా సాటిలేనిది

తమ ఫోర్‌‌‌‌కాస్టింగ్‌‌‌‌ కెపాసిటీతో ఎవరూ పోటీపడలేరని   ఇండియా మెటీరియాలజీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌(ఐఎండీ) గర్వంగా చెబుతుంది. తమ నైపుణ్యం, టెక్నాలజీ, దేశవ్యాప్త డేటా కలెక్షన్‌‌‌‌, కంప్యూటింగ్‌‌‌‌ పవర్‌‌‌‌ మరెవరికీ లేవని ఐఎండీ పేర్కొంటోంది.  ఫోర్‌‌‌‌కాస్టింగ్ మోడల్స్‌‌‌‌లో అడ్వాన్స్‌‌‌‌మెంట్‌‌‌‌ కారణంగా దేశంలో వడగాడ్పు మృతుల సంఖ్యను 2015 లోని 1,500 నుంచి ఈ ఏడాది 100 కి తగ్గించగలిగామని ఐఎండీ చీఫ్‌‌‌‌ ఎం మొహాపాత్ర అన్నారు. గత అయిదేళ్లలోనే ఫోర్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో కచ్చితత్వం 20–35 శాతం మెరుగైందని చెప్పారు.   ప్రైవేటు రంగంలోని ఏ కంపెనీ ఇది సాధ్యంకాదన్నారు.  ప్రైవేటు రంగంలోని ఫోర్‌‌‌‌కాస్ట్‌‌‌‌ ఏజన్సీలు తమతో పోటీపడటం కంటే, కలిసి పనిచేయాలని సూచించారు. ఐఎండీ ఇచ్చే సూచనలను నిర్ధారిత రంగానికి అనుగుణంగా రూపొందించి ప్రైవేటు సంస్థలు ఇవ్వొచ్చని చెప్పారు. ఫలితంగా దేశం బాగుపడుతుందని, ప్రైవేటు రంగ కంపెనీలకూ అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎర్త్‌‌‌‌ సైన్సెస్‌‌‌‌లో దేశంలోని ప్రైవేటు కంపెనీలు ఐఎండీని తట్టుకోవల్సిందేనని సింగ్‌‌‌‌ అంగీకరించారు.