ఇంకో రెండ్రోజులు వానలు

ఇంకో రెండ్రోజులు వానలు

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలు
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడా వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం 40 డిగ్రీలకుపైగా ఎండలు నమోదుకావొచ్చని తెలిపింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు పడ్డాయి. 26 ప్రాంతాల్లో మోస్తరు వానలు పడగా, 55 చోట్ల తేలికపాటి, 62 ప్రదేశాల్లో చిరుజుల్లులు కురిశాయి. క్యుములోనింబస్‌ మేఘాల ఎఫెక్ట్​తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో 5.5 సెంటీమీటర్లు, మైత్రీ వనంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా శనివారం మారిందని తెలిపింది. అది మరింత తీవ్రమై మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారొచ్చని పేర్కొంది. అది మొదట ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, 18 నుండి 20వ తేదీ మధ్య పశ్చిమ బెంగాల్ తీరంవైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.