
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. మార్చి 25, 26, 27 తేదీల్లో.. అంటే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణ జిల్లాలతోపాటు.. హైదరాబాద్ లో వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మార్చి 24వ తేదీ శుక్రవారం తూర్పు జిల్లా, హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశాలున్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ వేగంతో వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
మరీ ముఖ్యంగా.. శని, ఆదివారాలు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొన్నటి వరకూ ఉన్నంత తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడవు అని.. వర్షాలు అయితే ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం రాష్టంలోని కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.