ఢిల్లీ, హిమాచల్ లో భారీ వర్షాలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

 ఢిల్లీ, హిమాచల్ లో భారీ వర్షాలు..   ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మొత్తం 7 రాష్ట్రాల్లోని 1లక్షా 33 వేల మంది వరదలతో సతమతం అవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అటు..అస్సాంలో ఇప్పటికే వరదల పరిస్థితి మరింత దారుణంగా మారింది. రెండు రోజుల క్రితమే...ఢిల్లీ మొత్తం జలమయమైంది. అర్ధరాత్రి వరకు నమోదైన మరో ఆరు మరణాలతో రెండు రోజుల్లో మృతుల సంఖ్య 11కు చేరింది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం వరదల కారణంగా అయిదుగురు చనిపోయారు. నిన్న మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాదలీ ప్రాంత అండర్ పాస్  వద్ద నిలిచిన నీటమునిగి ఇద్దరు బాలురు మృతిచెందగా, వోఖలా అండర్ పాస్  నీటిలో స్కూటీతో చిక్కుకుపోయి దిగ్విజయ్ కుమార్  చౌధరీ  అనే వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ముందురోజు వసంత్  విహార్  ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి దాని కింద చిక్కుకుపోయిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను నిన్న వెలికితీశారు.

ఢిల్లీకి ఐఎండీ ఆరెంజ్  అలర్ట్  హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్  ప్రదేశ్ లోనూ అధికారులు ఆరెంజ్  అలర్ట్  జారీ చేశారు. అర్ధరాత్రి వరకు కురిసిన భారీవర్షాలకు కాంగ్డా, కులు, సోలన్  జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్  వద్ద సూఖీ నదిలో పలు కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు, బైకులు వరదల్లో తెప్పల్లా తేలుతున్నాయి.