మరింత బలపడిన అల్పపీడనం.. ఇయ్యాల భారీ వర్షాలు

మరింత బలపడిన అల్పపీడనం.. ఇయ్యాల భారీ వర్షాలు
  • 8, 9 తేదీల్లో రెడ్ అలర్ట్ 
  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ నెల 7, 8, 9 తేదీల్లో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కాగా, శనివారం పెద్దపల్లి జిల్లా అకినేపల్లి, మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలలో 9.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.

హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలతోపాటు.. శివారు ప్రాంతాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హఠాత్తుగా ఆకాశం మబ్బులు కమ్ముకోవడం.. గంట సేపు భారీ వర్షం.. ఆ తర్వాత రెండు మూడు గంటలు చినుకులు పడి.. తర్వాత ఎండ వస్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.