మరో 2రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

మరో 2రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం నిన్న తెల్లవారుఝామున 5.30 గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారింది. 

ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడడంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయి. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, అలాగే ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు

మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా రెండ్రోజులుగా ముసురు పట్టింది. నిన్న హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో చిరుజల్లులు పడ్డాయి. నిన్న సెలవురోజు కావడం, చలిగాలులు వీస్తుండడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. బయటకు వచ్చినవాళ్లు స్వెట్టర్లు, రెయిన్ కోట్లతో కనిపించారు. వానలు, పొగమంచుతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన కొన్ని విమానాలను అధికారులు నిన్న దారి మళ్లించారు. మస్కట్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వైపు వెళ్లే విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా మోస్తరు వర్షం పడ్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్ పేట్, గోల్కొండ, ఖైరతాబాద్ , ట్యాంక్ బండ్ , హిమాయత్ నగర్ , నారాయణగూడ, నాంపల్లి, మెహిదీపట్నం, లంగర్ హౌజ్ , సన్ సిటీ, బండ్లగూడ, హయత్ నగర్ , సరూర్ నగర్ , ఉప్పల్ , తదితర ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు మోస్తరు వర్షం పడుతోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా మోస్తరు వర్షాలు

తుఫాన్ ప్రభావంతో రెండు, మూడు రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాతో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడ్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లాలు, రోడ్లపై ఎండబోసిన ధాన్యం, కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ముసురు, చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు పడ్తుండంతో వడ్లను కాపాడుకోవడానికి తిప్పలు పడ్డారు.

కొనుగోలు సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు లేవు. దీంతో వడ్లు తడవకుండా  సంచులు, పాలిథీన్  కవర్లను కప్పారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రైతులు. కాంటా పెట్టిన వడ్లు బస్తాలకు బస్తాలు సెంటర్లలోనే ఉంటున్నాయిని చెబ్తున్నారు. మరోవైపు వర్షాలకు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని వివరించింది.