పెళ్లిళ్ల ప్యాకేజీలు మార్చిన వెడ్డింగ్​ ప్లానర్లు

పెళ్లిళ్ల ప్యాకేజీలు మార్చిన వెడ్డింగ్​ ప్లానర్లు
  • బంధుగణానికి మాస్కులు, శానిటైజర్లూ
  • సోషల్​ డిస్టెన్స్​పై అనౌన్స్​మెంట్లు
  • మండపంపైకి కుటుంబ సభ్యులకే అనుమతి
  • రూ.3 లక్షలకు తగ్గిన ఖర్చులు

హైదరాబాద్​, వెలుగుపెండ్లి.. జీవితంలో ఒక్కసారి వచ్చే తంతు. అలాంటి పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని కుర్రాళ్లు, ‘పెళ్లంటే ఇట్ల చెయ్యాల్రా’ అంటూ పది మంది చెప్పుకోవాలని వాళ్ల తల్లిదండ్రులు ఆరాటపడిపోతరు. ఆకాశమంతా పందిరేసి.. వందలాది మందిని పిలిచి అంబరాన్నంటేలా చేయాలనుకుంటరు. కానీ, కరోనా టైంలో ఆ కల్యాణ గడియలు వస్తే..! మొత్తం రివర్స్​! రూల్సన్నీ చేంజ్​! ఆడంబరంగా జరగాల్సిన పెళ్లిళ్లు సింపుల్​గా జరిగిపోతాయి. కేంద్ర సర్కార్​ అలాంటి రూల్సే పెట్టింది. అమ్మాయి, అబ్బాయి తరఫున25 మంది చొప్పున 50 మంది గెస్టులకే పరిమితి పెట్టింది. అయినా డోంట్​ వర్రీ అంటున్నారు వెడ్డింగ్​ ప్లానర్లు. దగ్గరుండి ఉన్నంతలో భద్రంగా, గ్రాండ్​గా పెళ్లి చేయిస్తామంటున్నారు. గెస్టులకు పన్నీరు చల్లడం కాదు.. శానిటైజేషన్​ టన్నెల్స్​ పెడతామంటున్నారు. మాస్కులు, గ్లోవ్స్​ తామే ఇస్తామంటున్నారు. సోషల్​ డిస్టెన్స్​ పాటించేందుకు దూరం దూరంగా టేబుల్స్​ వేస్తామంటున్నారు. అవసరమైతే యాంకర్లను పెట్టి అనౌన్స్​ చేయిస్తామని చెబుతున్నారు. డెకరేషన్​ నుంచి పోలీస్​ పర్మిషన్​ వరకూ అన్నీ దగ్గరుండి చూసుకుంటామంటున్నారు. దానికి తగ్గట్టు ప్యాకేజీల్లో మార్పులూ చేస్తున్నారు. ప్యాకేజీలో భాగంగా అతిథులకు ఈ–ఇన్విటేషన్​ పంపడం, బ్రైడల్​ మేకప్​, మెహంది ఆర్టిస్ట్​, ఫొటో బూత్​, కార్​ డెకరేషన్​, మండపం, సన్నాయి మేళం, ఫుడ్​, ఫొటోగ్రాఫర్​, వీడియో గ్రాఫర్​ వంటి వాటితో పాటు వచ్చిన గెస్టులకు థర్మల్​ స్క్రీనింగ్​ చేయడం, యూవీ హ్యాండ్​ శానిటైజేషన్​, మాస్కులివ్వడం వంటి వాటినీ మేనేజ్​ చేస్తున్నారు. మండపం డెకరేషన్​కు వచ్చే లేబర్​, ఫొటోగ్రాఫర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సోషల్​ డిస్టెన్స్​ ఉండేలా

పెళ్లయినా వేరే ఫంక్షన్​ ఏదైనా ఫుడ్​కు చాలా మంది ఇంపార్టెన్స్​ ఇస్తారు. ఈ విషయంలోనూ వెడ్డింగ్​ ప్లానర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాటరింగ్​ దగ్గర బాయ్స్​ ఉండకుండా మెనూకు తగ్గట్టు ఫుడ్​ను బాక్సుల్లో ప్యాక్​ చేసి పెడుతున్నారు. సోషల్​ డిస్టెన్స్​ పాటించేలా గెస్టుల కోసం 6 అడుగుల దూరంతో రౌండ్​ టేబుల్స్​ వేస్తున్నారు. అందరూ గుంపులుగా ఉండకుండా యాంకర్​ను పెట్టి ఎల్​ఈడీ స్క్రీన్ల ద్వారా అరగంటకొకసారి అనౌన్స్​ చేయిస్తున్నారు. ప్రతి గెస్ట్​ అరగంటకొకసారి చేతులను కడుక్కునేలా చూస్తున్నారు. పెళ్లి మండపంలో కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్లు ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎంత మంది గెస్టులొచ్చారన్నదానిని ఎప్పటికప్పుడు ఎక్సెల్​ షీట్​లో మెయింటెయిన్​ చేస్తున్నారు.

వాటి ఖర్చు తక్కువే

కరోనా కారణంగా ప్యాకేజీలో చేర్చిన సేఫ్టీ ప్రికాషన్స్​ ఖర్చు తక్కువేనంటున్నారు వెడ్డింగ్​ ప్లానర్లు. మెడికల్​, సేఫ్టీ మెజర్స్​ ఐటమ్స్​ను కొన్ని ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్నారు. వారికి ఆర్డర్​ ఇస్తే శానిటైజేషన్​ స్టాండ్​, 50 మాస్కులు, 50 జతల గ్లోవ్స్​ రూ.15 వేలల్లో వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. దాంతో పాటు పెళ్లి జరిగే ప్లేస్​ మొత్తాన్ని శానిటైజ్​ చేసి వెళ్తున్నారని వెడ్డింగ్​ ప్లానర్లు చెబుతున్నారు. వెడ్డింగ్​ ప్లానర్ల చెబుతున్న దాని ప్రకారం.. పెళ్లి ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు 25 లక్షల దాకా చార్జ్​ చేస్తే ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గిందంటున్నారు.

ఖర్చు 3 లక్షలకు తగ్గిపోయింది

లాక్​డౌన్​ మొదలైన వారం నుంచే ప్యాకేజీల్లో మార్పులు చేశాం. ఇప్పటిదాకా 10కి పైగా ఈవెంట్స్​ చేశాం. ఒకప్పుడు పెళ్లికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ ఉండేది. ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గిపోయింది. తక్కువ మంది అతిథులతోనే పెళ్లిళ్లు అవుతున్నాయి. పెళ్లికి ముందే పోలీసుల పర్మిషన్​ తీసుకుంటున్నాం. పెళ్లి జరిగే టైంలో డ్యూటీ ఆఫీసర్​ వచ్చి చెక్​ చేసి వెళ్తారు. యాంకర్​ ద్వారా అరగంటకోసారి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అనౌన్స్​ చేయిస్తున్నాం. ఫుడ్​ కూడా సెల్ఫ్​ సర్వీస్​. అన్నింటినీ బాక్సుల్లో ప్యాక్​ చేస్తున్నాం.

– అరుణ్​ కుమార్​, వెడ్డింగ్​ ప్లానర్​, వజ్ర ఈవెంట్స్​