లగ్గాల జోరు..లాక్ డౌన్ సడలింపులతో మొదలైన సందడి

V6 Velugu Posted on Jun 13, 2021

 

  • 20, 23, 28 తేదీల్లో లక్షల మ్యారేజీలు
  • జులై 4 దాకా ముహూర్తాలు..
  • బట్టలు, బంగారం కొనుగోళ్లతో షాపింగ్ మాల్స్​లో సందడి..
  • ఫంక్షన్ హాళ్లకు పెరిగిన గిరాకీ.. ఈవెంట్ మేనేజర్లు బిజీబిజీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లగ్గాల సందడి మళ్లీ షురువైంది. కరోనా కేసులు తగ్గడం, లాక్​డౌన్‌‌లో సడలింపులు పెరగడం, మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. కరోనా వల్ల వాయిదా వేసుకున్నోళ్లు, కొత్తగా సంబంధాలు కుదుర్చుకున్నోళ్లు అప్పుడు పెళ్లి పనుల్లో మునిగిపోతున్నారు. జులై 4 దాకా మంచి ముహూర్తాలు ఉన్నాయని పంతుళ్లు చెబుతున్నారు. ఈ నెల 20, 23, 28 తేదీల్లో గట్టి ముహూర్త బలం ఉండడంతో ఆ మూడు రోజుల్లో లక్షలాది పెళ్లిళ్లు జరగనున్నాయి.

104 రోజుల మూఢాలు

ఫస్ట్ వేవ్ తర్వాత ఈ ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 22 వరకు 104 రోజుల మూఢాలు వచ్చాయి. ఆ తర్వాత మే 13 నుంచి మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో చాలా మంది పెళ్లిళ్లు పెట్టుకున్నారు. కానీ అప్పటికే సెకండ్ వేవ్ మొదలు కావడం, చాలా మంది హాస్పిటళ్లల్లో చేరి సీరియస్ కావడం, మరణాలు పెరగడంతో ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించింది. మే 12 నుంచి ఇది అమలులోకి వచ్చింది. 

ఉదయం 6 నుంచి 11 గంటల వరకే సడలింపులు ఉండడంతో  కొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. పెళ్లికి అటెండ్ అయ్యే బంధువుల సంఖ్యపై పోలీసులు స్ట్రిక్ట్‌‌గా ఉండటంతో చాలా మంది మనసు మార్చుకున్నారు. పెళ్లంటే చుట్టాలు, ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్‌‌గా చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు తమ పనులకు, పిలుపులకు టైం సరిపోదని భావించారు. దాంతో ఫంక్షన్ హాల్ బుకింగ్స్ క్యాన్సిల్ లేదా పోస్ట్ పోన్ చేసుకున్నారు.

అయినా కొందరు ఆగలే

ముహూర్త బలం ఉందనో, కరోనా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక కొందరు సింపుల్‌‌గానే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇండ్లల్లో 10 మందితోనే పెండ్లి తంతు ముగించిన వాళ్లు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌‌‌‌‌‌‌‌లో లాక్‌‌డౌన్ సందర్భంగా ఓ పెళ్లికొడుకు ఆటోలో బయల్దేరి వెళ్లాడు. మొత్తం నలుగురు వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు. చాలా పెళ్లిళ్లు ఇట్లనే సింపుల్ గా జరిగాయి. ఎండా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండవు. జూన్ లో తొలకరితో బాగా బిజీగా ఉంటుంది. కాబట్టి కొందరు ఉన్న దాంట్లో, వచ్చిన వాళ్లతో పెళ్లిళ్లు కానిచ్చారు. అందుకే పోస్ట్ పోన్ అయిన లగ్గాల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. కానీ సిటీ, టౌన్లలో మాత్రం చాలానే పోస్ట్ పోన్ అయ్యాయి. కొత్తగా ముహూర్తాలు పెట్టుకుంటున్న వాళ్ల కూడా చాలా మందే ఉన్నారు.

ఉందిలే మంచి కాలం

మూఢాలు, లాక్ డౌన్ల తర్వాత ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉండడంతో జనం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ నెల 13, 16, 20, 23, 26, 27, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెప్తున్నారు. జులై 4 వరకు డేట్స్ ఉన్నాయని అంటున్నారు. తర్వాత ఆషాఢం మొదలు కానుంది. జులై 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాడంలో సాధారణంగా పెళ్లిళ్లు చేయరు. ఆగస్టు 12 నుంచి మళ్లీ మంచి రోజులే. అంత వరకు ఆగడం ఎందుకు అనుకున్న వాళ్లు ఇప్పుడే ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పెళ్లిళ్లు మొదలుకావడంతో షాపింగ్ పెరిగింది. బట్టలు, బంగారం దుకాణాలు బిజీ అయ్యాయి. ఫంక్షన్ హాల్స్ కు బుకింగ్స్ పెరిగాయి. కేటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజర్లు పనిలో పడుతున్నారు. ‘‘మళ్లీ కస్టమర్ల తాకిడి మొదలైంది. లాక్​డౌన్‌‌‌‌‌‌‌‌ సడలింపులు పెరగడంతో షాపింగ్ కి వస్తున్నారు. గోల్డ్ రేట్ పెరుగుతుందనే భయంతో ఇప్పుడు కొనేస్తున్నారు’ అని మానేపల్లి జ్యువెలరీస్​కు చెందిన -గోపీకృష్ణ చెప్పారు.

లాక్ డౌన్ లో బట్టల బిజినెస్ ఫరవా లేదు. రూరల్ ఏరియాల్లో వ్యవసాయ పనులు ఉంటాయని సింపుల్ గా పెళ్లిళ్లు చేసేశారు. పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్లు, కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్లతో మా బిజినెస్ బాగానే ఉంది. ఇంకో నెల రోజులు ఇట్లాగే బిజీగా నడస్తదనిపిస్తోంది. 
- వెంకటేశ్ అంబడి, 
 ఓనర్, పద్మావతి క్లాత్ స్టోర్స్, నిర్మల్

లాక్ డౌన్, కరోనా వల్ల దాదాపు 75 శాతం పెళ్లిళ్లు ఇండ్ల దగ్గర జరిగాయి. 25 శాతం మాకు ఆర్డర్స్ వచ్చాయి. మా ఫంక్షన్ హాల్ కు గత నెల 20, 25 ఆర్డర్లు వచ్చాయి. మూడు పెళ్లిళ్లకు 20, 30 మంది మాత్రమే వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఎంక్వైరీలు వస్తున్నాయి.
 - మధుసూదన్ రెడ్డి, 
   ఫంక్షన్ హాల్ ఓనర్, హైదరాబాద్

మే13 తర్వాత ముహూర్తాలు మొదల య్యాయి. ముహూర్తాల గురించి ఆలోచించి కొందరు లాక్ డౌన్‌‌‌‌‌‌‌‌లో ఇండ్లలోనే పెళ్లిళ్లు జరిపారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ కారణంగా మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకున్న వారు ఇప్పుడు సడలింపుల సమయం పెంచడంతో రెడీ అవుతున్నారు..
- వినోద్ శర్మ, 
   పురోహితుడు, హైదరాబాద్

లాక్ డౌన్ తో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మంచి ముహూర్తం దొరకదని ఇప్పుడు తక్కువ మందితోనైనా చేసుకుంటున్నారు. ఈ నెలలో 20, 23, 28 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. జులై 4 వరకు లగ్గాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాఢం. మళ్లీ శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లు.  
- డాక్టర్ ఎంఎన్‌‌‌‌‌‌‌‌ చార్య,  
   పురోహితుడు, హైదరాబాద్
 

Tagged wedding, corona cases, Lockdowns, better moments

Latest Videos

Subscribe Now

More News