పెళ్లిళ్లు వాయిదా..ఈ సీజన్ లో సుమారు లక్ష వివాహాలు

పెళ్లిళ్లు వాయిదా..ఈ సీజన్ లో సుమారు లక్ష వివాహాలు

హైదరాబాద్‌‌, వెలుగుకరోనా భయంతో పెండ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నరు. ఫల్గుణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నయని పెండ్లి పెట్టుకున్నోళ్లలో మస్తుమంది వాయిదా వేసుకున్నరు. జరుగుతున్న పెండ్లిళ్లకు కూడా జనం వస్తలేరు. ఒకవేళ వచ్చినా 200 మంది దాటితే పోలీసులు కేసులు పెడ్తున్నరు. దీంతో ఫంక్షన్​హాల్స్​కూడా కిరాయికి ఇయ్యనికి ఎనకముందాడుతున్నరు. ఇప్పటికే పెళ్లిళ్లు పెట్టుకున్నవాళ్లు మినహా కొత్తగా ఎవరూ ముహూర్తాలు పెట్టుకోవద్దని, నెలాఖరు తర్వాత పెళ్లిళ్లకు బుకింగ్‌‌లు చేసుకోవద్దని మ్యారేజ్‌‌ హాల్స్‌‌ ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా గెస్టులు 200 మందికి మించొద్దని పేర్కొంది. వారం, పది రోజుల వ్యవధిలో పెళ్లిళ్లు ఉన్నవాళ్లు, క్యాన్సిల్‌‌ చేసుకునేందుకు వీలు లేనివాళ్లు, ముహూర్తంపై సెంటిమెంట్‌‌ ఉన్నవాళ్లు, గెస్ట్‌‌లు తగ్గినా పరవాలేదనుకునే వాళ్లు మాత్రమే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ చాలామంది మాత్రం రద్దు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌‌లో ఏటా ఐదు లక్షల పెళ్లిళ్లు జరుగుతాయి. మార్చ్‌‌, ఏప్రిల్‌‌, మే నెలలో దాదాపు లక్ష వరకు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో 80 శాతం మ్యారేజెస్‌‌ పోస్ట్‌‌పోన్‌‌ అవుతున్నాయి. జీవితంలో పెళ్లి మెమరబుల్‌‌ ఈవెంట్‌‌కనుక చాలామంది సందడిగానే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇపుడున్న రిస్ట్రిక్షన్స్‌‌ చూసి తర్వాత చేసుకోవచ్చని అనుకుంటున్నారని ఈవెంట్‌‌ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. చాలా మంది జూన్‌‌, జులై నెలల్లో ముహూర్తాల కోసం వెదుకుతున్నారన్నారు. ఈ సీజన్‌‌లో పెళ్లిళ్ల పేరిట దాదాపు 1500 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుందన్నారు. బట్టల షాపింగ్‌‌, మ్యారేజ్‌‌ హాల్‌‌, జ్యువెలరీ, డెకరేషన్‌‌, క్యాటరింగ్‌‌ ఇలా రకరకాల ఖర్చులతో కలిపి వేల కోట్లలో బిజినెస్‌‌ జరుగుతుందని, ప్రస్తుతం బాగా తగ్గిందన్నారు.

సుట్టాల్లేని పెళ్లెందుకు?

ఈ నెల 30న తన కూతురు పెళ్లి చేయాలని ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఉద్యోగి నర్సింగ్‌‌ రావు భావించారు. కానీ దాన్ని మరో మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ‘మా కుటుంబంలో ఇదే మొదటి పెళ్లి. చాలా గ్రాండ్‌‌గా చేయాలనుకున్నాం. మూడు వేల మందిని పిలిచాం. ఇందులో మెజారిటీ పెళ్లికి వచ్చేవాళ్లే. కానీ గవర్నమెంట్‌‌ 200 మందికి మించి ఉండద్దంటోంది. పెళ్లికి వచ్చేవాళ్లను ఎట్లా ఆపుతాం. అందుకే పో స్ట్‌‌ పోన్‌‌ చేయాలని నిర్ణయించుకున్నాం. మా వియ్యంకులు కూడా ఒప్పుకున్నారు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు.
ఈ పరిస్థితుల్లో వాడు కూడా రావడం కష్టమన్నాడు’అని చెప్పారు. ఆయన కూతురు పల్లవి మాట్లాడుతూ ‘నా కజిన్స్‌‌, ఫ్రెండ్స్‌‌ చాలామంది పెళ్లికి రాలేమని అన్నారు. వాళ్లు లేకుండా పెళ్లి చేసుకుంటే థ్రిల్‌‌ ఎలా ఉంటుంది. అందరి మధ్య చేసుకుంటేనే మ్యారేజ్‌‌ ఫీలింగ్‌‌ ఉంటుంది. లైఫ్‌‌లో ఒక్కసారే కదా చేసుకునేది. అందుకే పోస్ట్‌‌పోనే బెటర్‌‌ అనుకున్నా’మని చెప్పింది.

మందెక్కువుంటే వద్దంటున్నం

మ్యారేజ్‌‌ హాల్స్‌‌ ఓనర్లు కూడా ఎక్కువ మంది పెళ్లికి అటెండ్‌‌ అవుతారంటే బుకింగ్‌‌కి ఒప్పుకోవడం లేదు. పోలీసులు హాల్‌‌ని సీజ్‌‌ చేస్తారనే భయం వారిలో ఉంది. పోలీసుల నుంచి ఇప్పటికే తమకు కొన్ని ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ వచ్చాయని ఎల్‌‌బీ నగర్‌‌ ప్రాంతంలోని హాల్‌‌ ఓనర్‌‌ ఒకరు తెలిపారు.
‘ఇప్పటికే బుకింగ్‌‌ చేసుకున్న వారికి గెస్ట్‌‌ల సంఖ్య గురించి స్ట్రిక్ట్‌‌గా చెబుతున్నాం. లేదంటే క్యాన్సిల్‌‌ చేసుకోమంటున్నాం. క్యాటరింగ్‌‌ కూడా 200 మందికి పరిమితం చేస్తున్నాం. కొందరు కాంప్రమైజ్‌‌ అవుతున్నారు. కొందరు వేరే డేట్‌‌కి పోస్ట్‌‌పోన్‌‌ చేసుకుంటామ’ని అడుతున్నారు. హాల్‌‌ ఖాళీగా ఉంటే పోస్ట్‌‌పోన్‌‌మెంట్‌‌కు ఒప్పుకుంటున్నామని ఆయన చెప్పారు.
అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిని బాగా ఆర్గనైజ్‌‌ చేయడం కూడా కష్టంగా ఉందని ఆయన అంటున్నారు. పెళ్లి ఏర్పాట్లుకు కావాల్సినంత మంది వర్కర్లు దొరకడం లేదంటున్నారు. డెకరేటర్ల కొరత ఉందని, క్యాటరింగ్‌‌ స్టాఫ్‌‌ సమస్య కూడా
ఉందన్నారు.

లైవ్ ​స్ట్రీమింగ్.. ఆన్​లైన్​ దీవెనలు

ఇప్పుడు ఎక్కువగా మార్చ్ లో కన్ఫర్మ్ చేసిన మ్యారేజెసే అవుతున్నాయి. ఎక్కువ గ్యాదరింగ్ ఉండే పెళ్లిళ్లు పోస్ట్ పోన్ అయ్యాయి. చాలా మంది గెస్టులు తమంతట తామే పెళ్లిళ్లకు అటెండ్ కావడం లేదు. ఇపుడు జరుగుతున్న పెళ్లిళ్లలో ఫ్యామిలీ మెంబర్స్‌‌ మాత్రమే ఉంటున్నారు. ఈ మంత్‌‌లో మేం 12 వెడ్డింగ్స్​ని టేకప్ చేశాం. అందులో ఎనిమిదే జరిగాయని వజ్ర ఈవెంట్స్‌‌ ఓనర్‌‌ అరుణ్‌‌ కుమార్‌‌ తెలిపారు. ఫ్రెండ్స్‌‌, చుట్టాలు లైవ్‌‌ స్ట్రీమింగ్‌‌ ద్వారా వెడ్డింగ్‌‌ చూస్తూ ఆన్‌‌లైన్‌‌లోనే దీవెనలు అందజేస్తున్నారని అన్నారు.

పంతుళ్లు కూడా దూరం

కరోనా ఎఫెక్ట్‌‌ చూసిన కొందరు పంతు ళ్లు కూడా తాము పెళ్లి చెయ్యమని చెబు తున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్‌‌ వచ్చిందం టే పురోహితులు బిజీగా ఉంటారు. ఒక్కో రోజు రెండు మూడు పెళ్లిళ్లు కూ డా చేస్తుంటారు. కానీ ప్రభు త్వం పెట్టిన రిస్ట్రిక్షన్‌‌ చూసి వాళ్లు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎల్‌‌బీ నగర్‌‌లోని పురో హితుడు శివ మాట్లాడుతూ నేను శుక్ర వారం ఒక పెళ్లి చేయాల్సి ఉండే. ఎక్కు వ మంది వస్తున్నారని తెలిసింది. వెంట నే క్యాన్సిల్‌‌ చేసుకున్నా. వైరస్‌‌ స్ప్రెడ్‌‌ కాకుండా అందరం జాగ్రత్త పడాలి. అందరూ బాధ్యతగా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్‌‌ చేయగలుగుతాం అని అన్నారు.

సండే బదులు మండే

భైంసా/ జైనూర్‌‌‌‌: జనతా కర్ఫ్యూతో ఆదివారం జరగాల్సిన పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కుమ్రం భీం జిల్లా జైనూర్ మండలానికి చెందిన పొలాసరావుజీగూడ గ్రామంలో ఆదివారం మెస్రం వంశీయుల పెళ్లి జరగాల్సి ఉంది. నెల కిందటే ముహూర్తం నిర్ణయించారు. వెడ్డింగ్ కార్డ్‌‌లు కూడా పంచారు. ఆదివాసీల సంప్రదాయం  ప్రకారం పెళ్లికి రెండు రోజుల ముందు శుక్రవారం వధూవరులకు పుణ్య స్నానాలు కూడా చేయించారు. అయితే జనతా కర్ఫ్యూ కారణంగా శనివారం సమావేశమైన గ్రామ పెద్దలు పెళ్లి వాయిదా వేయాలని కోరారు. వారి మాటకు కట్టుబడి ఇరు కుటుంబాలవారు వాయిదా వేసుకున్నారు. సోమవారం పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఉట్నూర్‌‌‌‌ మండలం టక్కుగూడలో సైతం ఓ పెళ్లి వాయిదా వేశారు.