SME IPOల కోసం ఏఐ టూల్.. బీఎస్ఈ సరికొత్త నిర్ణయం, ఏంటి ఉపయోగం..?

SME IPOల కోసం ఏఐ టూల్.. బీఎస్ఈ సరికొత్త నిర్ణయం, ఏంటి ఉపయోగం..?

SME IPO: గడచిన కొన్ని త్రైమాసికాలుగా భారతీయ స్టాక్ మార్కెట్లలోకి వరుసగా ఐపీవోల రాక చూస్తూనే ఉన్నాం. అయితే వీటిలో మెయిన్ బోర్డ్ ఐపీవోల కంటే ఎస్ఎమ్ఈలే అధికంగా ఉన్నాయి. పైగా రోజురోజుకూ ఎస్ఎమ్ఈ ఐపీవోల రాక మార్కెట్లలోకి పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ ఆలస్యాలకు కారణంగా మారుతోంది. పైగా ఇన్వెస్టర్లు ఈ కేటగిరీ కంపెనీలపై బెట్టింగ్ వేసే ముందు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. 

ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ జనరేటివ్ ఏఐ టూల్ ఉపయోగించటం ద్వారా ఎస్ఎమ్ఈ ఐపీవోల డాక్యుమెంట్లను వెరిఫికేషన్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ముసాయిదా పత్రాలను స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించటానికి మునుపే ఏఐ టూల్ వాటిని పరిశీలించనుంది. ఈ ప్రక్రియను ఫాలో అవటం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియలోని ఆలస్యాలను తగ్గించవచ్చని బీఎస్ఈ భావిస్తోంది. దీనికి అనుగుణంగా మర్చంట్ బ్యాంకర్లకు పత్రాలను అప్ లోడ్ చేసేందుకు అనుమతి అందించనున్నట్లు తన తాజా సర్క్యులర్ ద్వారా వెల్లడించింది.

ALSO READ | ఇండియాలో అమెజాన్ భారీ పెట్టుబడులు..2వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ విస్తరణ

ముందుగా మర్చంట్ బ్యాంకర్లు డాక్యుమెంట్లను ఏఐ టూల్ కి అందించగానే ఏఏ ప్రాంతాల్లో మార్పులు అవసరమనే అంశాన్ని గుర్తించి తగిన మార్పులతో తిరిగి రావాలని టూల్ సూచించనుంది. ఏఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మర్చంట్ బ్యాంకర్లు అవసరమైన మార్పులు చేసి చివరిసారిగా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది.  ప్రస్తుతం బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీ కింద లిస్ట్ అయిన మెుత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.68వేల 507 కోట్లుగా ఉన్నట్లు తేలింది.