వీకెండ్ రోజుల్లో ఆ రూట్లో వెళితే అంతే..

వీకెండ్ రోజుల్లో ఆ రూట్లో వెళితే అంతే..

హైదరాబాద్: కుత్బుల్లాపూర్​లోని  సూరారం మెయిన్​ రోడ్​ చౌరస్తాలో వారాంతపు సంత వాహనదారులు, స్థానికులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రతి శనివారం రోడ్డు మీదే ఈ సంత జరగుతుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకూ సంత జరుగుతుండగా.. క్రమక్రమంగా ఎక్కువ రద్దీ పెరిగి ట్రాఫిక్‌‌ జామ్ అవుతోందని వాహనదారులు చెప్తున్నారు. సంతకు వచ్చే వారు, అటుగా వెళ్లే కార్లు, బైక్​లతో రోడ్డంతా కిక్కిరిసిపోతోందంటున్నారు. చౌరస్తా నుంచి లక్ష్మీ నగర్ వరకు అర కిలోమీటర్ ఉండగా.. ఈ దూరాన్ని దాటాలంటే గంటకు పైగా టైమ్ పడుతోందని వాపోతున్నారు. సూరారంలో చాలా వీధుల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. 

 ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారుల మధ్య ఒక్కోసారి గొడవలు జరుగుతున్నాయంటున్నారు. ఒక్క సూరారంలోనే కాకుండా గ్రేటర్​లోని చాలా ప్రాంతాల్లో వారంలో ఏదో ఒక రోజు ఇలా మెయిన్ రోడ్లపై సంతలను నిర్వహిస్తున్నారు. పర్మిషన్ లేకుండా నిర్వహించే ఇలాంటి వారాంతపు సంతల కారణంగా ట్రాఫిక్ జామ్ తో అత్యవసర పనుల మీద వెళ్లేప్పుడు ఎక్కువ ఇబ్బందిగా ఉంటోందని వాహనదారులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన వీధుల్లో  జరుగుతున్న సంతలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతున్నారు.