వీకెండ్ పార్టీల్లో కాల్పుల మోత

వీకెండ్ పార్టీల్లో కాల్పుల మోత

వాషింగ్టన్: అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వీకెండ్ పార్టీల్లో కాల్పుల మోత మోగింది. శుక్ర, శని, ఆదివారాల్లో పలు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. పెన్సిల్వేనియాలో ఒక పోలీస్ అధికారి చనిపోయారు. మిస్సోరిలో హాలీడే క్రౌడ్ ను లక్ష్యంగా చేసుకుని పలువురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇల్లినాయీలో టీనేజర్స్ పార్టీలోనూ ఫైరింగ్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున షికాగో శివార్లలో వందలాది మంది జూన్ టీన్త్ పార్టీ చేసుకుంటుండగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 23 మంది గాయపడ్డారు.  వాషింగ్టన్ స్టేట్ లోని క్యాంప్ గ్రౌండ్ లో శనివారం రాత్రి ఓ మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్లేందుకు వేచి చూస్తున్న వారిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. శనివారం పెన్సిల్వేనియాలో పోలీస్ బారక్​లపైకి ఓ వ్యక్తి ట్రక్కులో దూసుకువచ్చి కాల్పులు జరపడంతో ఓ పోలీస్ ఆఫీసర్ మృతిచెందారు. 

పార్టీల్లో గొడవలే కారణం? 

సెయింట్ లూయిస్ లోని ఓ ఆఫీస్ బిల్డింగ్ లోనూ ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ యువకుడు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియా, కార్సన్ సిటీలో శనివారం అర్ధరాత్రి పూల్ పార్టీ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 8 మందికి గాయాలయ్యాయి. అయితే, పార్టీల్లో టీనేజర్ల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే కాల్పులకు దారి తీస్తున్నాయని అధికారులు చెప్తుండగా.. దేశంలో గన్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉండటమే అసలు కారణమని ఎక్స్ పర్ట్ లు అంటున్నారు.