కోల్‌కతా: ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పానిహటి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆమె.. ఇప్పటికే అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థి తీర్థంకర్ ఘోష్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఈ సందర్భంగా రత్న దేబ్‌నాథ్ మాట్లాడుతూ.."నా కుమార్తె కోసం, అలాగే టీఎంసీ ప్రభుత్వంలో భద్రత లేని మహిళల కోసం నేను ఎన్నికల్లో పోటీ చేశాను. నా బిడ్డ మరణానికి మమతా బెనర్జీ, ఆమె పార్టీ నాయకులే బాధ్యులు. నేను ఓట్ల కోసం వెళ్లినప్పుడు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానించారు. మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. నేను నా కూతురిలా డాక్టర్‌ని కాకపోవచ్చు, కానీ ప్రజా ప్రతినిధిగా ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను" అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా భద్రత, అవినీతి అంశాలే ప్రధానాంశాలుగా జరిగిన ఈ ఎన్నికల్లో రత్న దేబ్‌నాథ్ విజయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార టీఎంసీ పార్టీ కంచుకోటగా భావించే పానిహటిలో ఆమె గెలుపు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
