
పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ కరోనా వైరస్ బారినపడ్డారు. వలస కూలీల సమస్యల పరిష్కారం, అంఫాన్ తుఫాన్ సహాయ చర్యల్లో భాగంగా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేస్తూ ప్రజల్లో ఉంటున్న ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆప్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. గత వారంలో పశ్చిమ బెంగాల్ లో అల్లకల్లోలం చేసిన అంఫాన్ తుఫాన్ వల్ల ఆ రాష్ట్రంలో దాదాపు 86 మంది మరణించగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్ల పబ్లిక్, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. కరోనా లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సహాయ చర్యలతోపాటు అంఫాన్ తుఫాన్ రిలీఫ్ ఆపరేషన్లలో నేరుగా పాల్గొంటున్న మంత్రి సుజిత్ బోస్ కరోనా బారినపడడంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయన విస్తృతంగా పర్యటించిన నేపథ్యంలో ఎవరి ద్వారా వైరస్ సోకిందన్న దానిపై లింక్ గుర్తించడం కష్టంగా మారింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్లలో ఆయనతో కాంటాక్ట్ అయిన వారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా, పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకు 4536 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 295 మంది మరణించగా.. 1668 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.