
అమరావతి: సాధారణ నేరాలే కాదు.. వైట్ కాలర్ ఆర్ధిక నేరాలు.. వ్యాపారుల మోసాలను గుర్తించి.. వెలికితీసి కటకటాల పాలు చేసే విజిలెన్స్ అధికారుల పేరు చెబితే అందరికీ హడల్.. అయితే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు ఎస్పీ ఇంట్లో నే చోరీకి తెగబడ్డారు. ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లిన విషయం పసిగట్టి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి దూరి పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మొత్తం పోలీసు శాఖలోనే కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… పశ్చిమగోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రీజినల్ ఆఫీసర్(విజిలెన్స్ ఎస్పీ) ఎస్.వరదరాజులు ఏలూరు పట్టణంలోని మోతేవారి తోట ఐదవ రోడ్డులో నివాసం ఉంటున్నారు. సోమవారం ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించారు. విలువైన వస్తువులు దొంగలు ఎత్తుకుపోయినట్లు తేలింది. చోరీకి గురైన సొత్తు విలువ రూ.7.5 లక్షలుగా అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.