WI vs AUS: ఆసీస్ చేతిలో చిత్తు చిత్తు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

WI vs AUS: ఆసీస్ చేతిలో చిత్తు చిత్తు.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా మర్చిపోలేని రోజును మిగిల్చింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో అతి ఘోరంగా ఓడిపోయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 27 పరుగులకే ఆలౌటై తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో విజృంభించడంతో విండీస్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దీనికి తోడు స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ తీసి విండీస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్.

6 వికెట్ల నష్టానికి 99 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేశామనే ఆనందం విండీస్ కు కాసేపైనా మిగలలేదు. తొలి గంటలోపే విండీస్ ను ఆలౌట్ చేశారు. మిచెల్ స్టార్క్ తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. 14 ఓవర్లో తొలి మూడు బంతులకు బోలాండ్ హ్యాట్రిక్ తో చెలరేగాడు. వెస్టిండీస్ లో ఏకంగా 7 గురు డకౌట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. 

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 225 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 48 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షామర్ జోసెఫ్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 143 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. 205 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 27 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.