వానొచ్చే..మ్యాచ్‌ ఆగే!

వానొచ్చే..మ్యాచ్‌ ఆగే!

ప్రావిడెన్స్‌‌ (గయానా): ఓవైపు వర్షంతో దోబుచులాట.. మరోవైపు బాంగ్రా డాన్స్‌‌లతో హంగామా.. మ్యాచ్‌‌ అసాధ్యమే అనుకున్నా.. వరుణుడు కరుణించడంతో.. అనుకున్న సమయానికి కంటే బాగా ఆలస్యంగా మొదలైన తొలి వన్డేలో టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. బౌలర్లు సమష్టిగా రాణించి విండీస్‌‌ను కట్టడి చేశారు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో కడపటి వార్తలందేసరికి విండీస్‌‌ 13 ఓవర్లలో వికెట్‌‌ నష్టానికి 54 పరుగులు చేసింది. లూయిస్‌‌ (36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 బ్యాటింగ్‌‌), హోప్‌‌ (6 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.  రాత్రంతా కురిసిన వర్షం వల్ల ఔట్‌‌ఫీల్డ్‌‌ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌‌ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. దీంతో 43 ఓవర్లకు కుదించారు. ఇన్నింగ్స్‌‌ మొదలైన 5 ఓవర్ల తర్వాత మళ్లీ వాన పడి ఆగినా.. బౌలర్స్‌‌ రన్నరప్‌‌ వద్ద తడిగా ఉండటంతో మ్యాచ్‌‌ మొదలుకావడానికి మరింత సమయం పట్టింది. ఫలితంగా రెండోసారి మ్యాచ్‌‌ను 34 ఓవర్లకు కుదించారు. ఈ బ్రేక్‌‌ సమయంలో స్టేడియంలో పెట్టిన డీజేలో వచ్చిన సాంగ్స్‌‌కు అనుగుణంగా కెప్టెన్‌‌ విరాట్‌‌, ఇతర ఆటగాళ్లు బాంగ్రా డాన్స్‌‌ చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

నిరాశపర్చిన గేల్‌‌

వాతావరణం మేఘావృతంగా ఉండటంతో.. టాస్‌‌ గెలిచిన కోహ్లీ రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌‌ ఎంచుకున్నాడు. పర్‌‌ఫెక్ట్‌‌ లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో బంతులు వేసిన పేసర్లు భువనేశ్వర్‌‌, షమీ.. కరీబియన్‌‌ ఓపెనర్లు క్రిస్‌‌ గేల్‌‌ (4), లూయిస్‌‌ను బాగా ఇబ్బంది పెట్టారు. కనీసం సింగిల్స్‌‌ తీసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో తొలి 5 ఓవర్లలో 8 పరుగులే వచ్చాయి. మరో నాలుగు బంతుల తర్వాత వాన రావడంతో గంట మ్యాచ్‌‌ గంగలో కలిసింది. ఏడో ఓవర్‌‌లో తొలి సిక్సర్‌‌ బాదిన లూయిస్‌‌.. తర్వాతి ఓవర్‌‌ (ఖలీల్‌‌)లో 4, 6, 4తో 15 పరుగులు రాబట్టాడు. ఆ వెంటనే మూడో సిక్సర్‌‌ కొట్టడంతో 10 ఓవర్లలో విండీస్‌‌ స్కోరు 42/0కు చేరింది. కానీ 11వ ఓవర్‌‌ తొలి బంతికి గేల్‌‌ను.. బోల్తా కొట్టించి కుల్దీప్‌‌ షాకిచ్చాడు. 30 బంతులు ఆడిన ఈ యూనివర్స్‌‌ బాస్‌‌ ఒక్క ఫోర్‌‌ కూడా కొట్టకపోవడం గమనార్హం. 42 రన్స్‌‌ వద్ద విండీస్‌‌ తొలి వికెట్‌‌ కోల్పోయింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన హోప్‌‌ కుదురుకునేందుకు ప్రయత్నించగా, లూయిస్‌‌ తన జోరును కొనసాగించాడు. 13వ ఓవర్‌‌ పూర్తి కాగానే మళ్లీ వరుణుడు ప్రత్యక్షం కావడంతో మ్యాచ్‌‌ను నిలిపేశారు.