భిక్షాటన చేయిస్తుండు.. తెచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండు

భిక్షాటన చేయిస్తుండు.. తెచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుండు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన టాస్క్​ఫోర్స్ 

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో భిక్షాటన చేయిస్తూ.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ఓ యువకుడిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన ప్రకారం... కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అనిల్ పవార్ (28) సిటీకి వచ్చి ఫతేనగర్​లో ఉంటున్నాడు. ఈజీ మనీ కోసం చిన్నారులు , దివ్యాంగులు, వృద్ధులు , ఒంటరి మహిళలను ఎంగేజ్ చేసుకొని పలు చౌరస్తాల్లో వారితో భిక్షాటన చేయిస్తున్నాడు. ఇది పోలీసులకు తెలియడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సయోధ్య , స్మైల్ ప్రాజెక్ట్ ఎన్జీవోల ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ , జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ వద్ద భిక్షాటన చేస్తున్న 23 మంది అదుపులోకి తీసుకొని విచారించారు. 

అనిల్ పవార్ భిక్షాటన చేయిస్తూ ప్రతిరోజు రూ. 4,500 నుంచి రూ. 6 వేల వరకు తమ నుంచి తీసుకుంటున్నాడని తెలిపారు. రోజు కూలీగా ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున ఇస్తున్నాడని తమ గోడు చెప్పుకున్నారు. దీంతో అనిల్ పవార్​ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద ఉన్న రెండు బైక్​లను సీజ్ చేశారు. భిక్షాటన చేస్తున్న వారిని ఎన్జీవో హోమ్ కు తరలించారు. నిందితుడిపై బెగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషన్​లో ఎన్జీవో ఇన్​చార్జిలు లక్ష్మి కవిత , కె స్వప్న, బి సుజాత రాణి పాల్గొన్నారు.