బెంగాల్‌‌లో కొత్త అధ్యాయం..మార్పు కావాలి.. పగ వద్దు.. ఇది చారిత్రక విజయం

బెంగాల్‌‌లో కొత్త అధ్యాయం..మార్పు కావాలి.. పగ వద్దు.. ఇది చారిత్రక విజయం
  • గంగోత్రి నుంచి గంగాసాగర్ దాకా కమలం వికసించింది: మోదీ
  • హామీలు అమలు చేసి.. రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపడ్తం
  • మహిళా బిల్లును వ్యతిరేకించిన టీఎంసీ, డీఎంకే ఓడిపోయాయి 
  • అస్సాం, పుదుచ్చేరిలో గెలుపు ప్రజాస్వామ్యానికి ఘనవిజయమన్న ప్రధాని 

న్యూఢిల్లీ: బెంగాల్‌‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని బీజేపీ హెడ్​ఆఫీసులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు.. బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యంలో ఇది చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ‘ఇది విశ్వాసానికి, ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి విజయం’ అని మోదీ ఉద్వేగంగా ప్రకటించారు.

గంగోత్రి (ఉత్తరాఖండ్) నుంచి గంగాసాగర్ (పశ్చిమ బెంగాల్) వరకు కమలం వికసించిందని అన్నారు. గంగామాత ప్రవహించే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ- సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వాలు కొలువుదీరాయన్నారు. పశ్చిమ బెంగాల్‌‌లో దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. ఇది చరిత్రాత్మక రికార్డని అన్నారు. ఇందులో మహిళల భాగస్వామ్యం అసాధారణంగా ఉందని, ఇది భారత ప్రజాస్వామ్యానికే గొప్ప మలుపు అని పేర్కొన్నారు. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ కొత్త ఓటింగ్ రికార్డులు నమోదయ్యాయని తెలిపారు.

ఆ పార్టీలు మహిళల ఆగ్రహానికి గురవక తప్పదు

‘‘ దేశంలో మహిళా శక్తి ఇప్పుడు వేగంగా పురోగమిస్తోంది. అయితే, కొన్ని రోజుల కింద కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ మహిళా శక్తి పురోగమన వేగాన్ని అడ్డుకున్నాయి. ఈ మహిళా వ్యతిరేక పార్టీలు మహిళా బిల్లు సవరణను పార్లమెంటులో నిరోధించాయి. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించే పార్టీలు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నేను కొద్ది రోజుల కిందే చెప్పాను. ఈ రోజు సోదరీమణులు, కుమార్తెలు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలను శిక్షించారు. త్వరలోనే సమాజ్‌‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ మహిళల వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కాంగ్రెస్​ను కూడా దేశవ్యాప్తంగా మహిళలు శిక్షస్తారు” అని ఆయన అన్నారు.

కేరళలో వామపక్షాల పదేండ్ల దుష్పరిపాలన వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందిందని, కానీ రాబోయే ఎన్నికల్లో కేరళ తల్లులు, సోదరీమణులు కూడా కాంగ్రెస్‌‌కు గుణపాఠం నేర్పిస్తారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి, సిబ్బందికి, భద్రతా బలగాలకు మోదీ అభినందనలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య ఘనతను నిలబెట్టడంలో వారి సేవను చరిత్ర ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. విజయోత్సవాల్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

భయం వద్దు.. భవిష్యత్తుపై మాట్లాడాలి

బెంగాల్‌‌లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ‘బదలావ్’ (మార్పు) గురించి మాట్లాడాలి తప్ప ‘బదలా’ (పగ) గురించి కాదని మోదీ అన్నారు. ‘భవిష్య’ (భవిష్యత్తు) గురించి మాట్లాడాలి కానీ ‘భయ్’ (భయం) గురించి కాదని పిలుపునిచ్చారు. బెంగాల్‌‌లో భయం కాదు, ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ప్రజలు మార్పు కోసం, అభివృద్ధి కోసం, స్థిరత్వం కోసం ఓటు వేశారని తెలిపారు. బెంగాల్‌‌లో కొత్త అభివృద్ధి దిశ ప్రారంభమైందని ప్రకటించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ బెంగాల్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.