సుప్రీం కోర్టును ఆశ్రయించిన WFI

సుప్రీం కోర్టును ఆశ్రయించిన WFI

న్యూఢిల్లీ: స్టార్‌‌ రెజ్లర్‌‌ వినేశ్‌‌ ఫోగట్‌‌, ఇండియా రెజ్లింగ్‌‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌‌ఐ) మధ్య వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఎక్కింది. ఆసియా క్రీడల అర్హత పోటీల్లో పాల్గొనవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును డబ్ల్యూఎఫ్‌‌ సుప్రీం కోర్టులో సవాల్‌‌ చేసింది. 

హైకోర్టు తీర్పును న్యాయ వ్యవస్థ పరిధి దాటిన జోక్యంగా డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. అంతర్జాతీయ క్రీడలకు అథ్లెట్లను ఎంపిక చేసే పూర్తి అధికారం జాతీయ క్రీడా సమాఖ్యలకే ఉంటుందని సమాఖ్య తన పిటిషన్‌‌లో స్పష్టం చేసింది. ప్రకటించిన ఎంపిక నిబంధనల ప్రకారం వినేశ్‌‌ ఈ ట్రయల్స్‌‌కు అనర్హురాలని వాదించింది. 

2024 డిసెంబర్‌‌లో అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాస్తూ వినేశ్‌‌ స్వచ్ఛందంగా రెజ్లింగ్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు గుర్తుచేసింది. నిబంధనల ప్రకారం, రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగి రింగులోకి రావాలనుకునే క్రీడాకారులు ఆరు నెలల పాటు డోపింగ్ పరీక్షల పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి అని సమాఖ్య పేర్కొంది. 

గతేడాది డిసెంబర్ 18న డోప్ పరీక్షకు అందుబాటులో లేకపోవడంతో వినేశ్‌‌పై ఈ నెల 4న 'మిస్డ్ టెస్ట్' నమోదైందని సమాఖ్య తెలిపింది. దీనిపై మే 9న ఆమెకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామని, ఈ క్రమశిక్షణా ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వివరించింది. అంతేకాకుండా, ఫిబ్రవరిలో విడుదల చేసిన ఎంపిక విధానంలో 'ఐకానిక్ ప్లేయర్' లేదా 'ప్రసూతి సెలవుల' ఆధారిత మినహాయింపులకు ఎలాంటి చోటు లేదని స్పష్టం చేసింది.