అమెరికా చేసింది సాయం కాదు.. పెట్టుబడి : ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ కామెంట్​

అమెరికా చేసింది సాయం కాదు.. పెట్టుబడి : ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ కామెంట్​

వాషింగ్టన్: రష్యా ఆక్రమణపై తాము పోరాడేందుకు అమెరికా చేసిన వేల కోట్ల బిలియన్  డాలర్ల సాయం విరాళం కాదని, అది ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యంలో పెట్టుబడి అని ఉక్రెయిన్  ప్రెసిడెంట్ వోలోదిమిర్  జెలెన్  స్కీ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ చేసిన తర్వాత మొదటిసారిగా జెలెన్ స్కీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా యూఎస్  కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు. రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్ కు అమెరికా సాయం కొనసాగుతుందని, ఈ విషయంలో యూఎస్ కాంగ్రెస్ లోని ఉభయ పక్షాలకు ఎటువంటి అభ్యంతరం ఉండదని ఆశిస్తున్నానని జెలెన్  స్కీ పేర్కొన్నారు. ‘‘యూఎస్  కాంగ్రెస్ కు వచ్చి మీ (అమెరికన్లు) అందరితో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. రష్యాపై యుద్ధంలో మేము ఓడిపోలేదు. మేం ఓడిపోం. ఉక్రెయిన్  ఇంకా బతికే ఉంది. తీవ్రంగా పోరాటం చేస్తోంది. నిజానికి రష్యాను మేము ఓడించాం” అని జెలెన్  స్కీ వ్యాఖ్యానించారు. రష్యాపై యుద్ధాన్ని రెండో ప్రపంచ యుద్ధంతో ఆయన పోల్చారు. కాగా, అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో ఆయన భేటీ అయ్యారు.

జెలెన్ స్కీకి గ్రాండ్ వెల్ కం

అమెరికా పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీకి బుధవారం గ్రాండ్ గా వెల్ కం లభించింది. ముందుగా వైట్ హౌస్ కు చేరుకున్న జెలెన్ స్కీకి స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కారు వద్దకు వచ్చి వెల్ కం చెప్పారు. భుజంపై చేయి వేసి, నడుస్తూ మాట్లాడుకుంటూ వైట్ హౌస్ లోని తన ఆఫీసుకు వెంట తీసుకెళ్లారు. అనంతరం అమెరికన్ కాంగ్రెస్ జాయింట్ సెషన్ సందర్భంగా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో సహా కాంగ్రెస్ సభ్యులంతా లేచి నిలబడి రెండు నిమిషాలకు పైగా చప్పట్లు కొట్టి వెల్ కం చెప్పారు. తర్వాత జెలెన్ స్కీ మాట్లాడుతున్నప్పుడు సభ్యులు పలుమార్లు స్టాండింగ్ ఒవేషన్ తో అభినందించారు.