వాట్ యాన్ ఐడియా మేడమ్.. ఇళ్ల అద్దెకు భయపడి ఉద్యోగానికి విమానంలో

వాట్ యాన్ ఐడియా మేడమ్.. ఇళ్ల అద్దెకు భయపడి ఉద్యోగానికి విమానంలో

కొన్ని సార్లు ఖరీదైన ప్రాంతాల్లో పనిచేయడం తప్పదు. ఆ సమయంలో అక్కడి అద్దెలు భరించడం చాలా కష్టంతో కూడుకున్నదిగా మారుతుంది. అలాంటప్పుడు చాలా మంది ఎంచుకునే మార్గమేమిటంటే.. తక్కువ అద్దెలు ఉన్న ప్రాంతం నుంచి గంటల తరబడి నిరీక్షించైనా ఎలాగోలా ఆఫీసులకు చేరిపోతుంటారు. అదే తరహాలో అమెరికాలోని ఓ అమ్మాయి కూడా ఇంటి అద్దెలు భరించలేక వందల మైళ్ల దూరం ప్రయాణం చేస్తోంది. అది కారులోనో, బస్సులోనే కాదు.. ఏకంగా విమానంలోనే..

సౌత్ కరోలినాలోని కార్లెస్టన్ కు చెందిన సోఫియా సెలెంటానో.. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్ హెల్త్ అనే అడ్వర్టైజింగ్ సంస్థలో సమ్మర్ ఇంటర్న్ షిప్ చేసే అవకాశం దక్కింది. కానీ న్యూజెర్సీలో ఇంటి అద్దెలు చాలా ఎక్కువగా ఉండడంతో.. ఆమెకు ఓ ఐడియా వచ్చింది. రెండు నెలల తన ఇంటర్న్ షిప్ కాలంలో వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సి ఉండడంతో.. కార్లెస్టన్ నుంచి సుమారు 700మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్లీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది. రెండు నెలల్లో మొత్తం 8 రోజులు మాత్రమే వెళ్లాలి కాబట్టి.. దీనంతటికీ ఆమెకు తక్కువ ఖర్చే అవుతుందని ఆమె చెప్పింది.

అలా వెళ్లడం కోసం సెలెంటానో ఆ రోజు తెల్లవారుజామున 3గంటలకే మేల్కొంటుందట. అంతే కాదు ఆమె విమానంలో ప్రయాణించడం ఎందుకు చౌకగా ఉంటుందో కూడా స్పష్టం చేసింది. ఒకవేళ అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకుంటే దాదాపు రూ.2.7లక్షలు (3వేల 4వందల డాలర్లు) ఖర్చవుతాయని.. అదే వారంలో ఒకరోజు విమానంలో పోతే రోజుకు రూ.8వేలు అంటే 100 డాలర్లే అవుతుందని చెప్పింది. వీటితో పాటు తనకు ప్రయాణాలు, సాహసాలు చేయడంటే చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చింది.