జీఎస్టీ సంస్కరణలతో ఏం నష్టం జరిగింది?..ఆ నష్టమేంటో చెప్పకుండా మాట్లాడవద్దు : మంత్రి బండి సంజయ్

జీఎస్టీ సంస్కరణలతో ఏం నష్టం జరిగింది?..ఆ నష్టమేంటో చెప్పకుండా మాట్లాడవద్దు : మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు జరిగిన నష్టమేమిటో చెప్పకుండా ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్  అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  దక్షిణాది వ్యక్తేనని, నిజంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఏదైనా సమస్య ఉంటే ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. 

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా  ఆదివారం కరీంనగర్ లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి బాపూజీ విగ్రహానికి సంజయ్  నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలపై రేపటి నుంచి 29 వరకు  ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కొండా లక్ష్మణ్  బాపూజీ చేనేత సహకార ఉద్యమ నేతగా చేనేతతో పాటు కులవృత్తులు చేసుకునే వారి కంచంలో మెతుక అయ్యారని కొనియాడారు.