
మాస్కో: ఇటీవల భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో పర్యటించారు. టియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో మోడీ, పుతిన్ చైనా పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ, పుతిన్ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇరుదేశాధి నేతలు ఒకే కారులో జర్నీ చేసి.. పలు అంశాలపై డిస్కస్ చేశారు. కారులో మోడీ, పుతిన్ 45 నిమిషాల పాటు సీక్రెట్‌గా ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలో కారులో మోడీతో జరిగిన సంభాషణలో ఏం మాట్లాడుకున్నామనే విషయం బయటపెట్టారు పుతిన్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఇటీవల అలస్కాలో జరిగిన అమెరికా-రష్యా శిఖరాగ్ర చర్చల గురించి కారులో ప్రధాని మోడీకి వివరించానని చెప్పారు పుతిన్. అలాగే, రష్యా, భారతదేశం మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం గురించి డిస్కస్ చేశామన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో ఇండియాపై అమెరికా విధించిన సుంకాల గురించి చర్చించామని చెప్పారు పుతిన్.
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు 2025, ఆగస్ట్ 15న రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో భేటీ అయ్యారు ట్రంప్. అమెరికాలోని అలస్కాలో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం గురించి చర్చించారు పుతిన్, ట్రంప్. ఈ భేటీలో జరిగిన చర్చల గురించే తాజాగా చైనా పర్యటనలో ప్రధాని మోడీకి వివరించారు పుతిన్. అయితే, ట్రంప్‌తో భేటీ జరిగిన రెండు రోజులకే ప్రధాని మోడీకి ఫోన్ చేసిన పుతిన్.. ట్రంప్ తో జరిగిన చర్చల గురించి వివరించారు. చైనాలో మరోసారి ఇదే టాపిక్‌ను ప్రధాని మోడీకి పుతిన్ వివరించడం గమనార్హం.