వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

న్యూఢిల్లీ: రెండు వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకోవచ్చా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని సిద్ధార్థ్ నగర్‌‌లో కొందరికి తొలి డోస్‌గా కొవిషీల్డ్‌ టీకాను ఇవ్వగా.. పొరపాటుగా కొవ్యాక్సిన్‌‌ను రెండో డోస్‌‌గా ఇచ్చారు. దీంతో అక్కడి జనాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలా వేర్వేరు టీకాలను కలిపి తీసుకుంటే ఏమైనా అవుతుందేమోనని సందేహాలు నెలకొన్నాయి. అయితే దీనికి భయపడాల్సిందేమీ లేదని నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19లో మెంబర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. రెండు వ్యాక్సిన్‌‌లు కలిపి తీసుకున్నా వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. అయితే ఈ విషయంపై శాస్త్రీయంగా మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. 

మిక్సింగ్ టీకాలపై పరిశోధనలు
వేర్వేరు వ్యాక్సిన్‌లను కలిపి తీసుకోవచ్చా అనే దానిపై యూకేలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆక్స్‌‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, ఫైజర్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌‌లను కలిపి ఇవ్వడంపై పరిశోధనలు జరుగుతున్నట్లు లాన్సెట్ జర్నల్ తెలిపింది. రెండు టీకాలను నాలుగు కాంబినేషన్లలో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో రెండు మిక్సింగ్ డోసుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో 34 శాతం మందికి.. ఫైజర్, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 41 శాతం మందికి జ్వరం వచ్చిందని లాన్సెట్ రిపోర్టులో వెల్లడించింది. స్పెయిన్‌‌లో కొందరికి ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా.. ఫైజర్, కొవిషీల్డ్ కాంబినేషన్ టీకాలను కలిపి ఇవ్వగా.. వారిలో వైరస్‌‌ మీద పోరులో ఇమ్యూనిటీ పవర్ బాగా రెస్పాండ్ అయ్యిందని తేలింది. అయితే టీకాలను కలిపి తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ దిశగా ఇంకా చాలా పరిశోధనలు జరగాలని, డేటాను బట్టి వీటిపై ముందుకెళ్లాలని హెల్త్ అథారిటీస్ కూడా చెబుతున్నాయి. అప్పటివరకు వేర్వేరు వ్యాక్సిన్‌‌లను కలిపి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి.