అగ్నిపథ్ స్కీం ఏంటి..? యువత ఎందుకు వ్యతిరేకిస్తోంది?

అగ్నిపథ్ స్కీం ఏంటి..? యువత ఎందుకు వ్యతిరేకిస్తోంది?

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీం అగ్నిపథ్. త్రివిధ దళాల్లో చేరి దేశ సేవ చేయాలనుకునే యువత కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. 90 రోజుల్లో రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి 2023 జూలై నాటికి తొలి బ్యాచ్ సిద్ధం చేయాలన్నది కేంద్రం సంకల్పం. అగ్నిపథ్ లో ఎంపికైన వారిని ఎంపికైనవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. అయితే ఈ పథకంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఏడు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇంతకీ ఈ అగ్నిపథ్ స్కీం ఏంటి?  దీనిపై యువత ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారు?

అగ్నిపథ్ పథకం అంటే?
ఆర్మీలో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం యువత కోసం కేంద్రం ప్రకటించిన పథకం అగ్నిపథ్. ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకోనున్నారు. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఎంపికైన వారికి నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేసే అవకాశం కల్పిస్తారు. గడువు ముగిసిన తర్వాత వారి పని తీరును సమీక్షించి మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రెగ్యులరైజర్ చేస్తారు. వారికి 15 ఏండ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్‌లో పనిచేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 75శాతం మందికి ఎగ్జిట్ అవకాశం కల్పిస్తారు. వారంతా నాలుగేళ్ల సర్వీసు పూర్తైన తర్వాత ఉద్యోగం వదిలేయొచ్చు. ఎగ్జిట్ సమయంలో రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సేవా నిధి ప్యాకేజ్, స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అయితే వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారికి బ్యాంకుల నుంచి లోన్లు సులువుగా లభిస్తాయి. 

జీతం, ఇతర అలవెన్సులు
అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో చేరే అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు రూ.30,000 జీతం ఇస్తారు. ఇందులో రూ.21,000 చేతికి వస్తాయి. మిగిలిన రూ.9,000 అగ్ని వీర్ కార్పస్ ఫండ్ లో జమ చేస్తారు. రెండో ఏడాది నుంచి నెలకు రూ.33,000 జీతం చెల్లిస్తారు. అందులో రూ. 9,900 కార్పస్ ఫండ్ లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో రూ.36,500 జీతంలో రూ.10,980 కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. నాలుగో సంవత్సరం నెలకు రూ. 40,000 జీతం ఇస్తారు. ఇందులో రూ.12,000 కార్పస్ ఫండ్‌కి బదిలీ చేస్తారు. ఇలా నాలుగేళ్లలో మొత్తం రూ. 5,02,560  కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. ఈ మొత్తానికి దీనికి మరో రూ.5,02,560 అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీతో కలిసి నాలుగేళ్ల తర్వాత రూ.11,71,000 చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. నాలుగేళ్లలో ఆర్మీ రూల్స్ ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.

అగ్నిపథ్కు ఎవరు అర్హులు
పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు కలిగినవారు అగ్నిపథ్‌ పథకం కింద సైన్యంలో చేరొచ్చు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ నిర్వహించనందున కేంద్రం వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. ప్రస్తుతానికి అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అమ్మాయిలకు కూడా అవకాశం ఇస్తామని చెబుతున్నారు. 

సర్వీసులో ఉండగా చనిపోతే.. 
అగ్నివీరులు సైన్యంలో ఉండగా చనిపోతే.. రూ.48లక్షల జీవిత బీమా ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్రీమియాన్ని కేంద్రమే చెల్లిస్తుంది. ఒకవేళ విధి నిర్వాహణలో చనిపోతే రూ.44 లక్షలు ఎక్స్ గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. విధుల్లో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే అందుకు కూడా పరిహారం ఇస్తారు. 100శాతం వైకల్యం ఉంటి రూ.44 లక్షలు, 75 శాతమైతే రూ. 25 లక్షలు, 50 శాతమైతే రూ.15 లక్షలు చెల్లిస్తారు. 

యువత ఎందుకు వ్యతిరేకిస్తోంది..?
అగ్నిపథ్ స్కీంలో ఎంపికైన అగ్నివీరులను కేవలం నాలుగేళ్ల కోసమే సర్వీసులోకి తీసుకోవడంపై యువత మండిపడుతోంది. అంతేకాదు.. నాలుగేళ్ల తర్వాత 25శాతం మందిని పర్మినెంట్ చేసి మిగిలిన 75శాతం మందిని బయటకు పంపుతామనడం వారి ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటని వారు నిలదీస్తున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేవలం నాలుగేళ్లు మాత్రమే సర్వీసులోకి  తీసుకుంటామనడం వారిలో పోరాట స్పూర్తిని దెబ్బతీస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.