ఎక్కువ జీతం ఇచ్చినప్పుడు ఆడలేదు.. జీతం తగ్గినప్పుడు ఇరగదీస్తున్నాడు.. ఇంతకీ ఆ క్రికెటర్ జీతం ఎంత?

 ఎక్కువ జీతం ఇచ్చినప్పుడు ఆడలేదు.. జీతం తగ్గినప్పుడు ఇరగదీస్తున్నాడు.. ఇంతకీ ఆ క్రికెటర్ జీతం ఎంత?

రింకు సింగ్‌ .. ఇప్పుడు ఐపీఎల్, క్రికెట్ ఫ్యాన్స్   ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ 09న ఆదివారం రోజున గుజరాత్‌ టైటాన్స్‌పై  జరిగిన మ్యాచ్ లో  మనోడు సృష్టించిన విధ్వంసం అలాంటింది.  ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా జట్టును గెలిపించి ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాడు. ఇంతకీ ఎవరీ  రింకు సింగ్‌.. కేకేఆర్ జట్టు అతన్ని ఎంతకు కొనుగోలు చేసింది అనే విషయాలను నెటిజన్లు సెర్చ్ చేయడం  మొదలుపెట్టేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన  రింకు సింగ్‌ యూపీ తరఫున 2014లో దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 2017లో తొలిసారి 19 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోని పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఆ మ్యాచ్ లో అతనికి ఆడే అవకాశం దక్కలేదు.  మరుసటి ఏడాది జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు రూ. 80 లక్షలకు రింకును సొంతం చేసుకుంది. 2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున రింకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. గత ఐదేళ్ల పాటు అదే టీమ్ తరుపున ఆడుతూ వస్తున్నాడు. 

గతేడాది ఐపీఎల్ లోగాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. 2023 ఐపీఎల్ కు ముందు జరిగిన వేలంలో 55 లక్షలకు కొనుగోలు చేసి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్‌ మార్గదర్శకంలో రింకు సింగ్‌ రాటుదేలాడు.  ఇప్పటి వరకు 40 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 50 లిస్ట్‌ -ఏ, 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన రింకు సింగ్‌.. 8 సెంచరీలు, 41 హాఫ్‌ సెంచరీలతో 6,016 పరుగులు సాధించాడు. ఇక తన ఆరేళ్ల  ఐపీఎల్‌ కెరీర్ లో ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లను మాత్రమే ఆడిన రింకు సింగ్ 349 పరుగులు మాత్రమే చేశాడు.