సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయి. కొన్ని నెలలుగా తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులతో బాధ పడుతోంది. మొదట ఇవన్నీ పని ఒత్తిడి వల్లేనని భావించింది. కానీ ఒకరోజు ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రటి మచ్చలు కనిపించడంతో కొంత ఆందోళనకు గురైంది. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకుంది. అందులో “లుపస్” అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని తేలింది. మొదట ఆమె భయపడినా, సరైన ట్రీట్మెంట్, డైట్ ఫుడ్, యోగా, లైఫ్ స్టైల్ మార్పులతో ఇప్పుడు కోలుకుంటోంది. ఇంతకీ లుపస్ అంటే ఏంటి? పూర్తిగా నయమవుతుందా?
మామూలుగా మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి మనల్ని కాపాడుతుంది. కానీ లుపస్ వచ్చినప్పుడు ఆ సిస్టమ్ గందరగోళానికి గురవుతుంది. దాంతో ఆరోగ్యకరమైన కణాలపైనే దాడి చేయడం మొదలుపెడుతుంది. అందుకే దీనిని “ఆటో ఇమ్యూన్ డిసీజ్” అంటారు. లుపస్ ఒక్క భాగానికే పరిమితం కాదు. చర్మం, కీళ్లు, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి అనేక అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో, దాదాపు15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
కనిపించే లక్షణాలు
మామూలుగా ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రటి మచ్చలు, తీవ్రమైన అలసట, కీళ్ల నొప్పులు, తరచూ జ్వరం, జుట్టు రాలిపోవడం, ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం కందిపోవడం, చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి కూడా కనిపించొచ్చు. అయితే, లుపస్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి చర్మ సమస్యలు, మరికొందరికి కీళ్ల నొప్పులు, అలసట లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లుపస్‌ను బ్లడ్ టెస్ట్, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్, యూరిన్, ఈఎస్ఆర్/సీఆర్పీ వంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. కిడ్నీలపై ఎఫెక్ట్ ఉన్నట్లు అనిపిస్తే బయాప్సీ కూడా అవసరమవుతుంది. లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ఫ్యూచర్లో ఏఐ బేస్డ్ డయాగ్నోసిస్, ప్రొటీన్ బయో మార్కర్ల సాయంతో లుపస్‌ను ఫాస్ట్‌గా గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
నివారణ లేకపోయినా..
ప్రస్తుతం లుపస్‌కు పూర్తిస్థాయి నివారణ లేదు. అయినా, మోడర్న్ ట్రీట్మెంట్స్తో చాలావరకు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటివరకు స్టెరాయిడ్లు, ఇమ్యూనో సప్రెసెంట్ వంటి మెడిసిన్స్ వాడుతున్నారు. అయితే 2025లో ప్రచురితమైన పలు అధ్యయనాల్లో బెలిముమాబ్, రిటుక్సిమాబ్, టెలిటాసిసెప్ట్ వంటి బయోలాజిక్స్ పనికొస్తున్నాయని తెలిసింది. ముఖ్యంగా కిడ్నీలపై ప్రభావం చూపే లుపస్ నెఫ్రైటిస్ ట్రీట్మెంట్లో కొత్త మెడిసిన్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టు సైంటిస్ట్‌లు చెప్తున్నారు. భవిష్యత్తులో కార్ట్ సెల్ థెరపీ, ఇన్వెర్స్ వ్యాక్సిన్స్ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కొత్త మార్పులు తీసుకురావొచ్చని సైంటిస్ట్‌లు భావిస్తున్నారు.
ఫుడ్‌తో లుపస్ కంట్రోల్..
లుపస్‌కు సపరేట్ డైట్ లేదు. కానీ బ్యాలెన్స్డ్ డైట్‌తో శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గించొచ్చు. ఆకుకూరలు, తాజా పండ్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు ఉన్న చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్ వంటి ఫుడ్స్ శరీరానికి మేలు చేస్తాయి. కాల్షియం, విటమిన్ – డి ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, పనీర్ వంటివి ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడతాయి. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు, వేపుళ్లు, రెడ్ మీట్ వంటివి తగ్గించాలి. మొలకలు, వెల్లుల్లి వాడకం వల్ల కూడా కొందరిలో ఈ లక్షణాలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లుపస్ ఉన్నవారు ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడాలి. బట్టలు పూర్తిగా ధరించాలి. నిద్ర, మానసిక ప్రశాంతత, క్రమం తప్పని వ్యాయామం లేదా యోగా చాలా అవసరం. అలాగే డాక్టర్ సూచించిన మందులు వాడుతూ రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం తప్పనిసరి. అంతకంటే ముందు.. శరీరం ఇచ్చే సిగ్నల్స్‌ను గమనించి డాక్టర్‌ను కలిస్తే సమస్యను అదుపులో ఉంచొచ్చు. లుపస్ ఒక క్రానిక్ డిసీజ్ అయినప్పటికీ.. సరైన ట్రీట్మెంట్, హెల్దీ లైఫ్ స్టైల్, పాజిటివ్ థింకింగ్ ద్వారా ఆరోగ్యంగా జీవించొచ్చు.
