పదహారేళ్ల ఓ కుర్రాడు ప్రీ-మిక్స్‌తో చాక్లెట్ కప్‌కేక్స్ తయారు చేశాడు. అందులో కొన్ని మాడిపోయాయి. కానీ.. అప్పుడే అతనిలో బేకింగ్‌పై ఆసక్తి చిగురించింది. ఆ ఆసక్తి వల్లే ఇండియాలో ప్రముఖ సెల్ఫ్–టాట్ బేకర్స్‌లో ఒకరిగా ఎదిగాడు శివేష్ భాటియా. చిన్న వయసులోనే ఐదు కుక్‌బుక్స్ రాశాడు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఫేమస్ ఫుడ్ స్టైలిస్ట్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.
శివేష్ భాటియా 1996లో ఢిల్లీలో పుట్టాడు. జాయింట్ ఫ్యామిలీలో పెరిగాడు. అమ్మా, నానమ్మ వంటగదిలో బేకింగ్ వంటకాలు చేస్తుంటే ఆసక్తిగా చూసేవాడు. పైగా చిన్నప్పటి నుంచే అతనికి డెజర్ట్స్, కేక్స్ అంటే ఇష్టం. ‘‘నేను 11వ తరగతిలో ఉన్నప్పుడు బేకింగ్ చేయడం మొదలుపెట్టాను. మొదటగా మా కజిన్స్‌తో కలిసి వెనిలా కప్‌కేక్స్ చేశాను. ఎంత జాగ్రత్తగా చేసినా.. కొన్ని కప్‌కేక్స్ మాడిపోయాయి. కానీ.. ఆ ప్రక్రియ నాకు చాలా నచ్చింది. అందుకే తరచుగా బేకింగ్ చేయాలి అనిపించేది. అలా కొన్నాళ్లకు బేకింగ్ మీద ఇష్టం బాగా పెరిగిపోయింది” అన్నాడు శివేష్.
ఒత్తిడిని తగ్గించేది
11వ తరగతిలో ఉన్నప్పుడు శివేష్ స్కూల్ మారాడు. కుటుంబంలో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. ఈ రెండింటి వల్ల ఒత్తిడి పెరిగింది. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ ఆరోగ్యం
క్షీణించింది. ఇవన్నీ అతన్ని బాగా కుంగదీశాయి. అప్పుడు శివేష్కు బేకింగ్ ఒక థెరపీలా పనిచేసింది. అతను స్ట్రెస్ ఫీలైన ప్రతిసారి కజిన్స్‌తో కలిసి కేక్స్, డెజర్ట్స్ తయారుచేసేవాడు. ‘‘బేకింగ్ నాకు హీలింగ్ లాంటిది. అదినాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది” అంటాడు శివేష్.
కాలేజీ రోజుల్లోనే..
శివేష్ 2014లో సర్దార్ పటేల్ విద్యాలయంలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తిచేశాడు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో డిగ్రీ చదివాడు. అయితే.. స్కూల్‌లో ఉన్నప్పటినుంచే అతనికి రాయడం అలవాటైంది. హిందుస్థాన్ టైమ్స్, ది హిందూ లాంటి ప్రముఖ వార్తాపత్రికలకు ఆర్టికల్స్ రాసేవాడు. అప్పట్లో రాజకీయాలు, లాపై ఆసక్తి ఉండేది. ఈ జర్నీలో అతను బేకింగ్‌ను మాత్రం వదల్లేదు.
రెగ్యులర్‌గా కేక్స్ తయారుచేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు. వాటికి వేలల్లో లైక్స్ వచ్చేవి. అతని ఫ్రెండ్స్, ఫాలోవర్స్ మరిన్ని బేకింగ్ ఎక్స్‌పరిమెంట్స్ చేయాలని కామెంట్లు పెట్టేవాళ్లు. ఆ కామెంట్లు శివేష్‌ను స్టైలింగ్, ఫొటోగ్రఫీపై మరింత దృష్టి పెట్టేలా ప్రొత్సహించాయి.
బ్లాగ్స్.. వెబ్‌సైట్
ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతోనే డిగ్రీ చదువుతున్నప్పుడు 2014లో ‘బేక్ విత్ శివేష్’ పేరుతో బ్లాగ్స్ రాయడం మొదలుపెట్టాడు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోగలిగే డెజర్ట్ రెసిపీలు, ఆకర్షణీయమైన ఫుడ్ ఫొటోగ్రఫీ వల్ల అతని బ్లాగ్స్ యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు సంవత్సరం పాటు బ్లాగింగ్ చేసిన తర్వాత ‘బేక్ విత్ శివేష్’ పేరుతో సొంతంగా వెబ్‌సైట్ బిల్డ్ చేసుకున్నాడు.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు వైరల్ అవుతూ ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. దాంతో చదువు పూర్తి చేసిన తర్వాత శివేష్ బేకింగ్‌నే వృత్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అతని అభిరుచిని గుర్తించి, సంప్రదాయ కేరీర్ మార్గాలకు బదులు క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఉండాలని ప్రోత్సహించారు. ఆ తర్వాత యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, అందులోనూ సక్సెస్ అయ్యాడు.
యూట్యూబ్ జర్నీ..
ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అంటే 2014లోనే యూట్యూబ్‌లోనూ బేక్ విత్ శివేష్ పేరుతో చానెల్ క్రియేట్ చేశాడు. కానీ.. వీడియోలు అప్‌లోడ్ చేయలేదు. ఇన్‌స్టాలో, బ్లాగింగ్‌లో సక్సెస్ అయ్యాక 2019లో యూట్యూబ్‌లో మొదటి వీడియో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ చానెల్‌కు 2.33 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.
సింపుల్ ఇంగ్రెడియెంట్స్‌తో అందమైన డెజర్ట్స్ తయారు చేసే విధానం, ఫుడ్ స్టైలింగ్ వల్ల అతని కంటెంట్‌ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. శివేష్ ఇప్పుడు ఫుడ్ కంటెంట్ క్రియేషన్ రంగంలో ఒక బ్రాండ్‌గా మారాడు. నెస్ట్లే, న్యుటెల్లా లాంటి ప్రముఖ బ్రాండ్లతో కొలాబరేషన్స్ కూడా చేస్తున్నాడు.
ఎన్నో అవార్డులు
శివేష్ బేకింగ్ ప్రయాణంలో ఎన్నో విజయాలు అందుకున్నాడు. 2016లో అవుట్‌లుక్ సోషల్ మీడియా అవార్డు గెలుచుకున్నాడు. 2017లో వోగ్ “20 అండర్ 26” జాబితాలో, 2023లో ఫోర్బ్స్ “30 అండర్ 30” జాబితాలో చోటు సంపాదించాడు. 2017లో కాండేనాస్ట్ ట్రావెలర్ ఇండియా వాళ్లు ‘సోషల్ మీడియా స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో బెటర్ హోమ్స్ అండ్ గార్డెన్స్ వాళ్లు ‘బేక్ విత్ శివేష్’కు ఉత్తమ డెజర్ట్ బ్లాగ్ అవార్డును ఇచ్చారు. 2018లో లివింగ్ ఫుడ్జ్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఇన్‌స్టాగ్రామర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు అతను ఐదు కుక్‌బుక్స్ రాశాడు. మొదటి పుస్తకం ‘బేక్ విత్ శివేష్’ 2018లో విడుదల అయ్యింది. అది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. రెండో పుస్తకం ‘డెజర్ట్స్ ఫర్ ఎవ్రీ మూడ్’ 2020లో ప్రచురించాడు. ఈ రెండు ఇచ్చిన సక్సెస్‌తో ఏ కుక్‌బుక్ ఫర్ స్పెషల్ డేస్.. స్పెషల్ పీపుల్, ఎగ్‌లెస్ బేకింగ్ విత్ శివేష్, చాకొలెట్ పేరుతో మరో మూడు పుస్తకాలు రాశాడు.
