రష్యాలో వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ.. రాక్షసత్వానికి.. క్రూరత్వానికి మారుపేరు

రష్యాలో వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ..  రాక్షసత్వానికి.. క్రూరత్వానికి మారుపేరు

రష్యా.. ఈ పేరు వింటే అగ్రరాజ్యాల్లో ఒకటి అని గుర్తుకొస్తుంది.. ఇటీవల అయితే అధ్యక్షుడు పుతిన్ గుర్తుకొస్తున్నారు.. మనకు తెలిసింది ఇదే అయినా.. రష్యాలో మరో పేరు చాలా పాపులర్..  అదే వాగ్నర్ గ్రూప్. అవును.. ఈ గ్రూప్ పేరు వింటే చాలు ప్రపంచ దేశాల్లోని చాలా మందికి హడల్.. ఈ వాగ్నర్ గ్రూపును పెంచి పోషిస్తుంది ఎవరో తెలుసా రష్యా సైన్యం. వీళ్లు సైన్యం మాదిరిగానే ఉంటారు కానీ సైన్యం కాదు.. కిరాయి హంతకులు.. కిరాయి సైన్యం అన్నమాట. డబ్బులిస్తే చాలు రష్యా తరపున పోరాడటానికి.. ఇతర దేశాల్లో హత్య, దోపిడీలు, అల్లకల్లోలాలు చేయటానికి వీళ్లు రెడీ అంటారు.. అందుకే వాగ్నర్ గ్రూప్ అంటే చాలా దేశాలు ఉలిక్కి పడతాయి. 

వాగ్నర్ గ్రూప్ ను ఇన్నాళ్లు పెంచిపోషించింది రష్యా. దీన్ని ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తారు. కిరాయి సైనికుల నెట్ వర్క్ గా గుర్తింపు పొందింది. ఈ వాగ్నర్ గ్రూప్ కు చట్టానికి మించి పని చేస్తుంది. సైన్యం చేయలేని పనిని కూడా చేయగల శక్తి, సామర్థ్యాలు ఈ వాగ్నర్ గ్రూప్ ప్రత్యేకతలు. సైన్యం దగ్గర ఉండే తుపాకులు, యుద్ధ ట్యాంకులు, విమానాలు, బాంబులు, కత్తులు.. ఇలాంటి అన్ని యుద్ధ సామాగ్రి వీళ్ల దగ్గర ఉంటుంది. అధికారిక సైన్యంలోని సైనికుల కంటే వీళ్లు మహా శక్తివంతులు. టార్గెట్ పెట్టారంటే.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దూకేస్తారు ముందుకు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషిస్తుంది రష్యా. 2014లో ఫస్ట్ టైం ఈ వాగ్నర్ గ్రూప్ ను అధికారిక ముద్ర పడింది. 

వాగ్నర్ గ్రూప్ గా ఉన్న ఈ ప్రైవేట్ సైన్యం.. 2014 నుంచి రష్యా పారామిలటరీ సంస్థగా మారిపోయింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాల్లో రష్యా గూఢచారులుగా పని చేశారు ఈ గ్రూప్ లోని సైనికులు. లిబియా, సెంట్రల్ ఆఫ్రికా, మాలి దేశాల్లో రష్యా తరపున అల్లకల్లోలం చేయటంలో వీళ్లు కీలక పాత్ర పోషించారు. కీలక నేతలను హత్య చేయటం, అత్యాచారాలు వంటి పనులతో అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచారనే సమాచారం ఉంది.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో.. తూర్పు ఉక్రెయిన్ లోని బఖ్ ముట్ ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంలో వాగ్నర్ గ్రూప్ వ్యూహరచన, యుద్ధ తంత్రం ఉంది.  రష్యా లెక్కల ప్రకారం ఈ పారామిలటరీ సంస్థలో 5 వేల మంది సైన్యం ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. అంతర్జాతీయ సంస్థలు మాత్రం.. వాగ్నర్ గ్రూప్ లో 50 వేల మంది సైన్యం ఉన్నారని చెబుతున్నారు. అత్యంత క్రూరంగా.. రాక్షసంగా వ్యవహరించే వాగ్నర్ ప్రైవేట్ సైన్యం.. ఇప్పుడు రష్యాపైనే తిరుగుబాటు చేయటం అనేది సంచలనంగా మారింది. 

ఉక్రెయిన్ పై యుద్ధం జరుగుతున్న సమయంలో.. వాగ్నర్ గ్రూప్ పోరాటానికి సంబంధించి.. రష్యా సైన్యం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ పలుసార్లు విమర్శిస్తూ వస్తున్నారు ఆ సైన్యం అధినేత  ప్రిగోజిన్‌‌. రష్యా సైన్యం పిరికి పందలు అని.. పోరాటమే చేయటం లేదని.. వాగ్నర్ సైన్యం లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం లేదంటూ పలు సందర్భాల్లో ఆడియోల్లో.. వీడియోల్లో రష్యా ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రిగోజిన్. ఈ క్రమంలోనే రష్యా సైన్యంలోని ఉన్నత స్థాయిల్లోని అధికారులతో వైరం ఏర్పడింది. అప్పటి నుంచి ఉప్పు – నిప్పుగా ఉంది వాగ్నర్ – రష్యా సైన్యం మధ్య మాటల యుద్ధం. ఇప్పుడు అది చేతల వరకు వచ్చింది. 

తన దగ్గర ఉన్న 50 వేల మంది సైన్యంతో.. రష్యా సైన్యంపైనే తిరుగుబాటు చేసి.. రొస్తావ్ నగరంలోని రష్యా  మిలిటరీ స్థావరాన్ని ఆక్రమించుకున్నారు ప్రిగోజిన్. ఈ చర్యతో రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ అయ్యారు. వాగ్నర్ సైన్యం శక్తి సామర్ధ్యాలు బాగా తెలిసిన పుతిన్.. ఆచితూచి స్పందిస్తున్నారు.