భారతదేశంలో అణగారిన, అట్టడుగు కులాల సృజనాత్మక జీవనంలో కళలు భాగం. చారిత్రకంగా బహుజన వర్గాల వైవిద్యమైన సంస్కృతి, జీవనశైలి, ఆచార సాంప్రదాయాలు, పోరాటగాథలు కళాత్మకంగా ఉంటాయి. బహుజన వర్గాలంతా ఈ దేశ మూలవాసులు. ఈ దేశ పరిపాలకులు. కొందరు అగ్రవర్ణాల అధర్మ యుద్ధంలో ఓడిన బహుజనలంతా తమ రాజుల వారసత్వ పోరాటాలను, విజయాలను, త్యాగాలను స్మరించుకునే క్రమంలో పాటలు, సంగీతం, కథలు ఆవిర్భవించాయి.
ఒకరకంగా ఇవన్నీ అట్టడుగు ప్రజల చైతన్యం, వీరత్వం, పోరాటం, కష్టాలు, ఆనందం నుంచి పుట్టిన కళా సౌందర్యాలు. వీటిని బహుజనులు రంగస్థల వీధి నాటకాల ద్వారా మౌఖికంగా తరతరాలుగా ప్రదర్శిస్తున్నారు. ఇవి తదుపరి వారి జీవనోపాధిగా కూడా మారాయి.
అందుకే నేటి బీసీ, ఎస్సీ, ఎస్టీల డీఎన్ఏల్లోనే కళాత్మక దృక్పథం ఉంటుంది. ఈ సాంస్కృతిక కళారూపాలకు మంచి లాభాలు రావడంతో సినిమా రంగంలోకి తీసుకున్నారు. కాలానుగుణంగా వాటిని ఆధునీకరించి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.
కాబట్టి సినిమా కథ, కథనం అంతా సబ్బండ కులాల జీవపుట్టుకలు. వీటిని దర్శక, నిర్మాతలు, హీరోలతో సినిమాటిక్‌గా మార్చి ప్రేక్షకులకు చూపెడుతున్నారు. ఇది ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది.
బహుజనులకు స్థానమేది?
సినిమా రంగాన్ని తరిచి చూసినప్పుడు అందులోని కళారూపాలన్నీ సబ్బండ కులాల సాంస్కృతికతతో ముడిపడి ఉన్నాయి. కానీ, చిత్రసీమలో వారికి స్థానం లేదు. మరోవైపు కులవివక్షత స్పష్టంగా కనబడుతుంది. అత్యధికంగా ఉన్నతకులాల నుంచి హీరోలు, దర్శకులు, నిర్మాతలవుతున్నారు.
అణగారిన కులాల నుంచి అక్కడక్కడ కమెడియన్లు, రౌడీలు వంటి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. దాదాపుగా టాలీవుడ్‌లో ఇప్పటివరకు రెండు, మూడు కుల సమూహాలే రాణిస్తున్నాయి. సినిమా రంగంలో కుమ్మరి వాళ్ళ కుండ, పద్మశాలీల బట్ట, యాదవుల గొంగడి, మహేంద్రుల(మేదరి)బుట్ట, మాదిగల డప్పు, గిరిజనుల వైవిద్యమైన ఆదిమ సాంస్కృతిక జీవనం వంటి ఎన్నో కళారూపాలు సినిమా రంగంలో వాడుతున్నారు.
ఇవన్నీ చలన చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద మార్కెట్‌గా మారాయి. వాటితో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సినిమాలో దళిత బహుజన కులాలకు మాత్రం స్థానం లేదు. మరోవైపు సినిమాలు థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలు చూడలేని ఆర్థిక వస్తువుగా మారిపోయాయి. ఇలా విచ్చల విడిగా సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ సాధారణ ప్రజల రక్తం తాగుతున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమంలో ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఆధిపత్యం గురించి ఇటీవల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన అనేక విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. సామాన్యుల కళలను, కథల్ని దొంగిలిస్తున్న సినిమా ప్రపంచంలో అణగారిన కులాలకు ప్రాధాన్యత దక్కాలన్నారు. అప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టన్నారు.
ప్రజాస్వామీకరించాలి
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినప్పటికీ అన్ని రంగాల్లో ఇప్పటికీ అగ్రకుల ఛాయలు కనబడుతున్నాయి. సబ్బండ కులాల కళలతో నిర్మితమై సినిమాల్లోనూ ఇది కనిపిస్తోంది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం. అమెరికాలో జాతి వివక్షతతో అణచివేతకు గురైన నల్ల వాళ్లకు సినిమా రంగంలో నలభై శాతం అవకాశం కల్పించి వారి అభివృద్ధికి దోహదపడుతున్నారు.
కానీ, అలాంటి విశాలమైన ఆలోచనా దృక్పథం భారతీయ సినిమా రంగంలో లేకపోవడం బాధాకరం. మరోవైపు కొందరు హీరోలు విలువలు, బాధ్యతను మరిచి సినిమాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కూల్ డ్రింక్స్, గుట్కా, పాన్ మసాలా వంటి ప్రకటనల్లో నటిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ హీరోల పట్ల తెలుగు ప్రజలు వీరాభిమానాన్ని ప్రదర్శిస్తారు.
సినిమాల్లో వెనుకబడిన వర్గాలు అడుగడుగునా కుల దూషణలు ఎదుర్కొంటున్నారు. బయటకి కనిపించని వివక్షత కొనసాగుతోంది. కానీ, సినిమా అవకాశాల కోసం వెళ్లిన అట్టడుగు కులాల జూనియర్ ఆర్టిస్టులు వాళ్లకు జరిగే అవమానాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తెలుగు సినిమా రంగంలో కార్మికులుగా పనిచేసే లక్షలాది పేద ప్రజల జీవితాలకు భద్రత కూడా లేదు. ఇప్పటికైనా సినిమా రంగంలో పరివర్తన రావాలి.
కళామతల్లినే నమ్ముకున్న అట్టడుగు వర్గాలకు అవకాశాల కల్పనతో ప్రజాస్వామ్యీకరించాలి. ఆ రంగంలో పనిచేసే వాళ్లకు సామాజిక భద్రతనివ్వాలి. చిత్రసీమ దర్శక, నిర్మాతలు, హీరోలు సామాజిక బాధ్యతను గుర్తెరిగి సినిమాలు తీయాలి. లేదంటే సామాజిక తిరుగుబాటు తప్పదు.
- సంపతి రమేష్ మహారాజ్,సామాజిక విశ్లేషకులు-
