లాభాలు ఎంత.. వాటా వచ్చేదెంత?

లాభాలు ఎంత.. వాటా వచ్చేదెంత?

సింగరేణి కార్మికులకు ఏటా తప్పని నిరీక్షణ

ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు

లాభాలు ప్రకటించని యాజమాన్యం

మందమర్రి, వెలుగు: ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావస్తున్నా సింగరేణి లాభాలు ప్రకటించక పోవడంతో కార్మికులకు లాభాల్లో వాటా కోసం నిరీక్షణ తప్పడం లేదు. 2019–-20 ఆర్థిక సంవత్సరం సింగరేణి 64.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఇందులో 57.46 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసింది. ప్రతి ఏటా సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లిస్తోంది. కార్మికులకు చెల్లించే వాటాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఆనవాయితీ ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సింగరేణి ఆర్జించిన లాభాలు, కార్మికులకు లాభాల్లో ఎంత వాటా ఇస్తారనే విషయాలపై యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఎప్పుడూ ఆలస్యమే..

సింగరేణి సంస్థ 2019–-20 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాలపై యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇతర సంస్థలన్ని ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆడిట్ లెక్కలు పూర్తి చేసి లాభాలను ప్రకటిస్తాయి. సింగరేణికి వచ్చేసరికి లెక్కలు నెలల తరబడి సాగుతున్నాయి. లాభాలు ప్రకటించకపోవడంతో వాటా విషయంలో కార్మికులు డిమాండ్ చేయడానికి స్పష్టత లేకుండా పోయింది. దీంతో లాభాలు ప్రకటించాలని కార్మికులు కోరుతున్నారు. కార్మిక సంఘాలు కూడా ఇదే విషయంలో యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

1999 నుంచి లాభాల్లో వాటా

కార్మికులకు లాభాల్లో వాటా విధానం 1999 నుంచి సింగరేణిలో అమలవుతోంది. మొదటి సారి లాభాల్లో 10 శాతం వాటా పంపిణీ చేసిన సింగరేణి ప్రతి ఏటా కొంత పెంచుకుంటూ వస్తోంది. 10 నుంచి 11, 12, 15, 16, 17, 18, 20, 21, 23, 25, 27, 28 శాతానికి చేరుకుంది. ఏటా ఒకటి లేదా రెండు శాతం పెంచుకుంటూ వస్తున్నారు. 2019–-20 ఆర్థిక సంవత్సరం 64.02 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతో అంతకు ముందు ఏడాది తీరులోనే లాభాలు వస్తాయని భావిస్తున్నారు. సంస్థ లాభాలపై ప్రకటన చేయకపోవడంతో కార్మికుల వాటా డిమాండ్ పై సందిగ్ధత ఏర్పడింది. 30 నుంచి 35శాతం వాటా ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రానుంది.

కనిపించని గుర్తింపు సంఘం చొరవ

సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామంటూ చెప్పుకొనే సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సంస్థ ఆర్జించిన లాభాలు, కార్మికులకు చెల్లించే వాటా విషయంలో సింగరేణి, రాష్ట్ర  ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసురావడం లేదని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో కార్మికుల వాటా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. యాజమాన్యం సంస్థ సాధించిన లాభాల వివరాలను ప్రభుత్వానికి అందజేసిన తర్వాత వాటా ప్రకటన చేస్తోంది. ప్రధానంగా సింగరేణి గుర్తింపు సంఘం చొరవ తీసుకుంటేనే కార్మికుల లాభాల వాటాపై స్పష్టత వస్తుంది. ఇప్పటికైనా టీబీజీకేఎస్ నాయకులు ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు.