
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: ఎలాంటి చర్చలు లేకుండానే పాకిస్తాన్‌పై దాడిని ఎందుకు ఆపారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. పహెల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం సైన్యానికి మద్దతు తెలిపినా.. కేంద్రం ప్రభుత్వం మాత్రం పోరాటం ఆపడం కలచివేసిందన్నారు. గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగితే మన్మోహన్ సింగ్‌ను విమర్శించిన మోదీ.. ఇప్పుడు చేసిందేమిటని ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందో పార్లమెంట్ వేదికగా చర్చించాలన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం కూడా దాడులకు మద్దతు ప్రకటించిందని, ఇలాంటి టైంలో విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఒక్క ట్విట్టర్ ద్వారా యుద్ధ విరమణ ప్రకటించడంతో సైనికులు, దేశం మొత్తం ఆవేదన చెందుతోందన్నారు. ఆయన వెంట లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి ఉన్నారు.