ఓటుకు నోటు కేసు స్టేటస్ ఏంటి?

ఓటుకు నోటు కేసు స్టేటస్ ఏంటి?
  • ఓటుకు నోటు కేసు విచారణ ఎందాకొచ్చింది?
  • హైకోర్టులో విచారణ స్టేటస్ పై అఫిడవిట్ వేయండి
  • రేవంత్ తరఫు లాయర్​కు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో ఏ దశలో ఉందో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి తరుఫు లాయర్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ అనిరుద్ధా బోస్​తో కూడిన బెంచ్ గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ వినీత్ శరణ్ హైకోర్టులో ఈ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ రెడ్డి తరఫు లాయర్ సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ... జూన్18న ఈ కేసును హైకోర్టు కొంతమేర విచారణ జరిపిందని విన్నపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే, ఆగస్టు 21వ తేదీ తర్వాత కేసు విచారణకు రాలేదని తెలిపారు. జస్టిస్ వినీత్ శరణ్ జోక్యం చేసుకుంటూ హైకోర్టులో ఏం జరిగింది, కేసు విచారణ ఏ దశలో ఉందనే అంశాలను పొందుపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులకు సూచించారు. అలాగే, తన పేరు తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ఈ కేసుతో పాటే విచారిస్తామని బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

 

ఇవి కూడా చదవండి

ఇంగ్లిష్​ మీడియం మంచిదే!