టీడీపీ మ్యానిఫెస్టో రిలీజయింది.. మరి వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందంటే..

టీడీపీ మ్యానిఫెస్టో రిలీజయింది.. మరి వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందంటే..

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మరో ఏడాది సమయం ఉంది.  అయినా సరే ఇప్పటికే పార్టీల నేతలు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు.  వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టగా.. జనసేనాని  పవన్ వారాహి యాత్రకు సిద్దమవగా .. ప్రతిపక్ష పార్టీ టీడీపీ బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాలు నిర్వహించి.. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. అంతే కాకుండా మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు తొలి విడత ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.  మలి విడత మ్యానిఫెస్టోను అక్టోబరులో విడుదల చేస్తామని చెబుతున్నారు.  టీడీపీ మ్యానిఫెస్టో లో మూడు ప్రధాన వర్గాలను టార్గెట్ చేస్తూ  చంద్రబాబు విడుదల చేశారు.  అయితే ఈ సారి వైసీపీ కూడా అన్ని హంగులతో  మ్యానిఫేస్టోను  విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. 

ఉచితాలతో పాటు అభివృద్దిపై..

వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉండబోతుందనే అనే అంశంపై పలు పార్టీల్లో చర్చ జరుగుతుంది.  గత ఎన్నికల్లో గెలిచేందుకు ప్రశాంత్ కిషోర్ టీం పనిచేసిన విధంగానే ఈ సారి మ్యానిఫెస్టో తయారీకి ఒక బృందం పని చేస్తుందని వైసీపీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది.  ఉచితాల పైన కాకుండా.. ఈ సారి అభివృద్దిని కూడా మ్యానిఫెస్టోలో చేర్చాలనుకుంటున్నారట.  ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న సామాజిక వర్గాలకు .. . ప్రస్తుతం తాము అమలు చేస్తున్న పథకాల మొత్తాన్ని కొంత పెంచడంతో పాటు కొత్త పథకాలను కూడా సిద్ధం చేస్తున్నారట.  . జగన్ జిల్లాల పర్యటనలో మ్యానిఫేస్టో అని కాకుండా వరసగా ఒక్కొక్క పథకాన్ని బయటకు చెప్పే అవకాశముందని తెలిసింది. మూడు రాజధానులలోనూ తాను చేయబోయే అభివృద్ధిని కూడా మ్యానిఫేస్టోలో వివరించనున్నారు.

అదనంగా పథకాలు

చంద్రబాబును నమ్మవద్దంటూ ఇప్పటికే స్లోగన్‌తో వైసీపీ ప్రజల వద్దకు వెళుతుంది. గత ఎన్నికల మ్యానిఫేస్టోను అమలు పర్చకుండా చంద్రబాబు ఏ ఏ వర్గాలకు దూరం అయ్యారో... వారిని ఫ్యాన్ గుర్తు నుంచి మరలకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే మ్యానిఫేస్టోను టీడీపీకి మించి రూపొందించాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. ఈసారి అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలు మ్యానిఫేస్టోలో కన్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జనరంజకంగా....

జగన్ ఇప్పటికే తను గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన మ్యానిఫేస్టోలో 98 శాతం పూర్తి చేశామని ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈసారి మ్యానిఫేస్టోలో మరింత జనరంజకంగా పెట్టి ఆ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకోసమే జగన్ ఈ నాలుగేళ్ల పాటు పథకాల విషయంలో ఎలాంటి జాప్యం చేయలేదు. చెప్పింది చెప్పినట్లుగానే చేశారు. అదే ఇప్పుడు ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.

ప్రజలకు కనెక్ట్ అయ్యేలా 

 జగన్ ఇప్పటికే తన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలను మ్యానిఫేస్టో రూపొందిస్తున్న బృందానికి చెప్పినట్లు తెలిసింది. ఆయన ఆలోచనలను అనుసరించే కొత్త మ్యానిఫేస్టో రూపుదిద్దుకుంటోంది. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా పలు పథకాలను జగన్ అండ్ టీం రెడీ చేస్తున్నారు. త్వరలోనే కొత్త స్కీమ్‌లతో జగన్ జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమయిపోయారు.