కేసీఆర్ ఇప్పటి వరకు హైదరాబాద్ కు ఏం చేశారు: కిషన్ రెడ్డి

కేసీఆర్ ఇప్పటి వరకు హైదరాబాద్ కు ఏం చేశారు: కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.గత ఎన్నికల్లో TRS అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని చెప్పిన సీఎం కేసీఆర్‌… దానిపై ఎప్పుడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఎలా ఉండాలో చూపిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పాతబస్తీకి మెట్రో వెళ్లకుండా చేసి TRS, మజ్లిస్‌ పార్టీలు పాపం మూటగట్టుకున్నాయన్నారు.

తాత్కాలిక తాయిలాలు ఇచ్చి ఓట్లు పొందాలని TRS చూస్తోందన్నారు కిషన్ రెడ్డి. అబద్ధపు ప్రచారాలు ఇంకెన్నాళ్లు చేస్తారు… మాటలు కోటలు దాటుతున్నాయి… కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్‌ గోడలు దాటడం లేదన్నారు. తండ్రి, కొడుకుల పాలనలో నగరంలో అభివృద్ధి తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అవుతోందన్నారు. వరద సాయం కేవలం TRS కార్యకర్తలే దక్కించుకున్నారన్నారు. హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు.

దుబ్బాక నుంచి TRS పతనం ప్రారంభమైందని.. గ్రేటర్‌ ఫలితాలతో కల్వకుంట్ల పాలనకు స్వస్తి పలకాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే విషయాన్ని చర్చించి ప్రకటిస్తామన్నారు.