మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు..కాల్చిన వాటిని తింటే..

మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు..కాల్చిన వాటిని తింటే..

వానాకాలంలో ..ఓ వైపు వర్షం పడుతుంటే..మరో వైపు వెచ్చ వెచ్చని పదార్థాలు..చిరుతిళ్లు తింటే ఆ కిక్కె వేరు. ముఖ్యంగా వర్షాకాలంలో జనాలు ఎక్కువగా మొక్కజొన్న కంకులను తినేందుకు ఇష్టపడుతుంటారు.  కొందరి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటే..మరికొందరు నిప్పులపై కాల్చిన వేడి వేడి మొక్కజొన్న కంకులను ఆరగిస్తూ..ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వర్షాకాలంలో మొక్కజొన్నను తినడం అనేది టైంపాస్ కాదు..దీని వల్ల  ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. 

మొక్కజొన్న పంటను సాధారణంగా వర్షాకాలంలో పండిస్తారు. వానాకాలంలో అత్యంత సులభంగా దొరికే చిరుతిండి. అయితే పోషకాహార నిపుణులు ఇది టైం పాస్ ఫుడ్ కాదని..ఇందులో పోషకాలు, శరీరానికి తగిన కాలరీలు ఉంటాయని చెబుతున్నారు. ఒక మొక్కజొన్న కంకిలో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు,  4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్‌, 2 గ్రాముల ఫ్యాట్‌, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుందంటున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. 

మొక్క జొన్న వల్ల రక్తహీనతకు చెక్‌

మొక్కజొన్నలో విటమిన్‌ B12 పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉంటుంది. మొక్కజొన్న శరీరంలో ఎర్రరక్త కణాల ఉ‍త్పత్తిని పెంచుతుంది. ఇవి రక్త హీనతను నివారిస్తాయి. మొక్కజొన్నలో ఉండే  ఫోలిక్‌ యాసిడ్‌  గర్భవతులకు మేలు చేస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదపడుతుంది.  

బరువు పెంచుతుంది

మొక్కజొన్న కంకిని తినడం ద్వారా తక్కువ బరువు ఉన్న వారు బరువు పెరుగుతారు.  తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. మొక్కజొన్నలో పీచు పదార్థం (ఫైబర్‌) కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణమవడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు  మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొక్కజొన్నలో  యాంటి ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

కంటి ఆరోగ్యానికి మంచిది

మొక్కజొన్నలో బీటా–కెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్న గింజలను తింటే విటమిన్‌–A సమకూరుతుంది. విటమిన్‌–A మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు మొక్కజొన్నలో విటమిన్‌ B, C కూడా సమృద్ధిగా  ఉంటాయి. విటమిన్‌ B–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి.  స్వీట్‌ కార్న్‌ అయితే శరీరంలోని  రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే  యాంటీ–ఆక్సిడెంట్‌ కూడా ఉంటుంది. ఇది అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను యాంటీ ఆక్సిడెంట్లు అరికడతాయి.  గాయమైనపుడు కలిగే వాపు, మంట, నొప్పిని తగ్గించే శక్తి కూడా మొక్కజొన్నకు ఉంది. మొక్కజొన్నలో విటమిన్‌ Cతో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే కార్న్‌ ఆయిల్‌, కార్న్‌ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు.