కోహ్లీ వర్సెస్ గంభీర్ ... ఇంతకీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది?

కోహ్లీ వర్సెస్ గంభీర్ ... ఇంతకీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది?

బెంగళూరు, లక్నో జట్ల మధ్య మే 1, సోమవారం జరిగిన మ్యాచ్  కంటే ఆ మ్యాచ్ అయిపోయాక  బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో మెంటర్ గంభీర్‌ ల మధ్య  చోటుచేసుకున్న వివాదంపై ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ గొడవ ఎందుకు జరిగింది. ఎక్కడ జరిగింది?  మ్యాచ్‌ చివర్లో 16 - 17 ఓవర్ల మధ్య విరామ సమయంలో లక్నో  ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌ , ఆర్సీబీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మధ్యలో జరిగిన చిన్నపాటి గొడవే  ఈ వివదానికి కారణమంటూ పలువురు పేర్కొంటున్నారు. 

సిరాజ్‌ వేసిన ఆ ఓవర్‌ మొదటి ఐదు బంతుల్లో 8 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత వేసిన బంతి.. నవీన్‌ ప్యాడ్లకు తాకింది. అనంతరం సిరాజ్‌.. నవీన్‌ వైపు చూస్తూ బంతిని స్టంప్స్‌పైకి విసిరాడు. అప్పటికీ నవీన్‌ క్రీజులోనే ఉన్నాడు.  దీంతో నవీన్, సిరాజ్ ల మధ్య గొడవ స్టార్ట్ అయింది. మధ్యలోకి కోహ్లీ వచ్చాడు. అయితే వీరిని కూల్  చేసేందుకు అమిత్‌ మిశ్రా వచ్చాడు. అయితే మిశ్రాతో కూడా కోహ్లీ ఏదో అంటున్నట్లు కనిపించింది. 

ఆ తర్వాత కోహ్లీ గురించి నవీన్‌ ఏదో అంటుండగా అంపైర్‌ మధ్యలో కలగజేసుకున్నాడు. అయితే దీనిపై విరాట్‌ విసిగిపోయి అంపైర్‌కు తన ఉద్దేశాన్ని వివరించాడు.కోహ్లీ తన షూను చూపిస్తూ నవీన్‌పై ఏదో సూచనలు చేయడం వివాదం మరింత పెరిగేలా చేసింది. ఈ ఘటనే మ్యాచ్‌ అనంతరం విరాట్ గంభీర్‌ ల మధ్య వాగ్వాదానికి కారణమని తెలుస్తోంది.  

మ్యాచ్‌ అయిపోయాక  ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ, నవీన్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది.  ఆ తర్వాత కైల్‌ మేయర్స్‌, విరాట్‌ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్‌ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో గంభీర్ మళ్లీ ఏదో అన్నాడు.. అదే సమయంలో ఎదురుగా నవీన్‌ రావడంతో మరోసారి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. 

ఆ వెంటనే కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది వారిని విడదీశారు. అనంతరం రాహుల్ వచ్చి కోహ్లీతో మాట్లాడాడు. తన టీమ్‌ సభ్యుడు నవీన్‌ని కోహ్లితో మాట్లాడమని ఒత్తిడి చేసినా.. తను నిరాకరిస్తూ వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ మొదలైన గొడవ విరాట్ కోహ్లీ వర్సెస్ గంభీర్ గా మారింది.  అయితే కోహ్లీకి సపోర్ట్ గా బెంగళూరు టీమ్ నుంచి  మరో ప్లేయర్ రాకపోవడం గమనర్హం.