నేటి యువతలో ఆరోగ్యంతో పాటు ఫిట్ గా కనిపించాలన్న తపన ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఫిట్ గా ఉండాలనుకుంటే సరిపోదు.. అందుకోసం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. రోజంతా బిజీబిజీగా గడిపేస్తూ.. ఫిట్ గా ఉండాలంటే సాధ్యం కాదు. మంచి నిద్ర, ప్రతిరోజు వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యం.
7-8 గంటల నిద్ర
ప్రతి మనిషికి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. రాత్రి పడుకోవడానికి, ఉదయం లేవడానికి సరైన ప్రణాళిక తయారుచేసుకోవాలి. ఇలా సమయాన్ని పాటించడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది
20-30 నిమిషాల పాటు వ్యాయామం
వారానికి మూడు లేదా నాలుగు రోజుల తప్ప కుండా వ్యాయామం చేయాలి. అంటే నడవడం, పరుగులు తీయడం లాంటివి. ఉదయం లేదా సాయంత్రం 20-30 నిమిషాల పాటు దీనికి కేటాయించుకోవాలి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ఫిట్ గా ఉంచుతుంది. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది. అంతేకాదు. హృదయ సంబంధ వ్యాధులు దరిచేరవు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో ఉన్న అనవసర కొవ్వు తగ్గడమే కాకుండా ఎముకలు కూడా గట్టి పడతాయి. వీలైతే వారానికి ఒకసారి పనిచేసే ఆఫీసుకు నడిచివెళ్లడం మంచిది. లిఫ్ట్ మీద ఆధారపడకుండా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాలి. ఇది కూడా మంచి వ్యాయామమే.
Also read:- ఇంటి వైద్యం ఇలాచీ: టెన్షన్, హైబీపీ, షుగర్ అన్నింటికీ రామబాణం..
సమతుల ఆహారం
జంక్ ఫుడ్ తింటూ ఫిట్ గా ఉండాలనుకోవడం సరికాదు. ఫిట్ గా ఉండాలనుకునేవారు సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు (పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు) తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవాలి. పాలు, వెన్న, నెయ్యి, వేపుళ్లను దాదాపు తగ్గించడం మంచిది. వీటితో పాటు బరువు తగ్గడానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి నీళ్లు చాలా అవసరం. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. కానీ, అన్నం తిన్న గంట తర్వాతే మంచినీళ్లు తాగాలి.
