- ఖమేనీ చనిపోయినా ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం వెనకున్న శక్తి
- ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్
- చారిత్రక అవసరం నుంచి పుట్టి అత్యంత కీలకంగా మారిన వ్యవస్థ
టెహ్రాన్: ప్రపంచంలో ఏ దేశానికైనా సైన్యం ఒకటే ఉంటుంది.. కానీ ఇరాన్ లో మాత్రమే సైన్యానికి, ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగే వ్యవస్థ ఉంది. అదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ).. ఇరాన్ రాజకీయ, సైనిక మరియు ఆర్థిక ముఖచిత్రంలో ఐఆర్ జీసీ ది అత్యంత కీలకమైన పాత్ర. వాస్తవానికి దేశ సైన్యం కంటే, ప్రభుత్వానికంటే ఈ రివల్యూషనరీ గార్డ్స్ కే అధికారాలు ఎక్కువ.
ఈ విప్లవ సైన్యం కేవలం ఇరాన్ సుప్రీం లీడర్ కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, ప్రధాని, అధ్యక్షుడు.. తదితర వ్యవస్థలకు ఇది ఎలాంటి బాధ్యత వహించదు. దేశ సరిహద్దులను కాపాడటంతో పాటూ ఇస్లామిక్ విప్లవ ఆశయాలను రక్షించడం ఐఆర్ జీసీ ప్రధాన ఉద్దేశ్యం.
చారిత్రక నేపథ్యం
ఇరాన్‌లో 1979 లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత, అప్పటి సుప్రీం లీడర్ ‘‘ఆయతొల్లా రుహొల్లా ఖొమేనీ’’ ఈ దళాన్ని స్థాపించారు. అప్పట్లో సాధారణ సైన్యం పాత రాజు (షా) పట్ల విధేయత చూపుతుందనే భయంతో, కేవలం ఇస్లామిక్ వ్యవస్థకు మరియు సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఈ ప్రత్యేక దళాన్ని రూపొందించారు. కాలక్రమేణా ఇది దేశంలోని
అన్ని విభాగాలపై పట్టు సాధించి, ఒక శక్తిమంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది.
నిర్మాణం, ప్రత్యేకత
ఐఆర్ జీసీకి స్వంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. దీనిలోని రెండు ప్రధాన విభాగాలు కాగా, ఒకటి.. ఖుద్స్ ఫోర్స్ (ఐఆర్ జీసీ యొక్క విదేశీ విభాగం) , రెండోది బాసిజ్ మిలీషియా (అంతర్గత విభాగం). ఇరాన్ వెలుపల లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాల్లో సైనిక మరియు వ్యూహాత్మక కార్యకలాపాలను ఖుద్స్ ఫోర్స్ నిర్వహిస్తుంది. హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలకు మద్దతు
ఇవ్వడంలో ఇది కీలకం. దేశంలో తలెత్తే నిరసనలను అణిచివేసేందుకు, విప్లవ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడానికి బాసిజ్
మిలీషియాను ఉపయోగిస్తారు.
సుప్రీం లీడర్ అదుపులో అధికారం
ఐఆర్ జీసీ యొక్క అతిపెద్ద బలం దాని అధికారక్రమం. ఇది ఇరాన్ ప్రభుత్వానికి లేదా అధ్యక్షుడికి జవాబుదారీ కాదు. ఇది నేరుగా దేశ అత్యున్నత నాయకుడైన ‘‘సుప్రీం లీడర్’’ ఆదేశాల మేరకు పనిచేస్తుంది. దీనివల్ల దేశ విదేశాంగ విధానంలో మరియు అంతర్గత రాజకీయాల్లో ఐఆర్జీసీ మాటకే మొగ్గు ఉంటుంది. వాస్తవానికి, ఇరాన్ యొక్క అణు కార్యక్రమం మరియు క్షిపణి వ్యవస్థల
నియంత్రణ కూడా వీరి చేతుల్లోనే ఉంటుంది.
ఆర్థిక సామ్రాజ్యం
ఐఆర్జీసీ కేవలం ఆయుధాలతోనే కాకుండా, ఆర్థిక బలంతోనూ దేశాన్ని శాసిస్తోంది. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, దేశంలోని చమురు, గ్యాస్, నిర్మాణం, టెలికమ్యూనికేషన్స్ మరియు బ్యాంకింగ్ రంగాల్లోని ప్రధాన కంపెనీలు ఐఆర్జీసీ నియంత్రణలో ఉన్నాయి. వేల కోట్ల డాలర్ల టర్నోవర్ కలిగిన ఈ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు తమ సైనిక కార్యకలాపాలకు మరియు విదేశీ మద్దతుదారులకు ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల ఐఆర్జీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతలు మరియు అంతర్గతంగా ప్రజల్లో వస్తున్న మార్పులు ఈ దళానికి సవాలుగా మారాయి. ఇటీవల జరిగిన దాడుల్లో కీలక కమాండర్లను కోల్పోయినప్పటికీ, ఇరాన్ మనుగడకు మరియు ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాబల్యానికి ఐఆర్జీసీ ఇప్పటికీ వెన్నెముకగా నిలుస్తోంది.
