మేం చెప్పిందే నిజమైంది: వివేక్ వెంకటస్వామి

మేం చెప్పిందే నిజమైంది: వివేక్ వెంకటస్వామి

జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై మేఘాకు టెండర్ ఇప్పించారు

బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నట్లు తాను మొదటి నుంచీ చెబుతున్నానని, అది ఇప్పుడు సంగమేశ్వరం ప్రాజెక్టు టెండర్ మేఘా కృష్ణారెడ్డికి దక్కడంతో రుజువైందని బీజేపీ కోర్‌‌ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు.  ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై, మేఘా కృష్ణారెడ్డి దగ్గర కమీషన్లు తీసుకొని మేఘా కృష్ణారెడ్డికి సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు వచ్చేలా కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ముందు నుంచీ తాను చెప్తూ వచ్చానని ఆయన గుర్తు చేశారు. ‘‘అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌‌ను కావాలని వాయిదా వేయించి, మేఘా కృష్ణారెడ్డికే ఈ ఆర్డర్ వచ్చేలాగ కేసీఆర్ ప్రయత్నించారన్న నా ఆరోపణ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఎవరైతే సంగమేశ్వర ప్రాజెక్టు టెండర్ తీసుకున్నారో వారికి తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా ఇవ్వవద్దు” అని డిమాండ్ చేశారు.

సంగమేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారిపోతాయన్న విషయం కేసీఆర్‌‌కు కూడా తెలుసని, కానీ పైసల కోసం ఆయన తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమం కేవలం నీళ్ల గురించే.. అది కూడా కృష్ణా బేసిన్ నీళ్ల గురించే గొడవ ఉండె. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు లో కమీషన్లు తిన్న కేసీఆర్ అదే రిప్లికేట్ చేస్తూ సంగమేశ్వరం ప్రాజెక్టు విషయంలో జగన్‌‌తో కుమ్మక్కై మేఘా కృష్ణారెడ్డికి ప్రాజెక్టు టెండర్ దక్కేలా చేశారు. జగన్‌‌ను ప్రగతిభవన్ కు పిలిచి అక్కడ భోజనాలు చేసుకొని స్కెచ్ వేశారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ” అని దుయ్యబట్టారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల దందా అని తాను ఇంతకు ముందు చెప్పిందే ఇప్పుడు నిజంగా కనిపిస్తోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మోటార్లు ఎక్కువ పెట్టి , విపరీతమైన కాస్ట్ చేసి కొందరు ఆంధ్రా కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా కేసీఆర్ చూశారని, దీనిపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.