
సాధారణంగా గోళ్లు తెలుపు రంగులో ఉంటాయి. కానీ కొంతమందికి ఉన్నట్టుండి గోర్లు రంగు, షేప్ మారుతుంటాయి. ఆ.. ఏముందిలే అని ఈ మార్పును చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇది చాలా ప్రమాదమని హెచ్చరిస్తు్న్నారు ఆరోగ్య నిపుణులు. గోళ్లు రంగు లేదా ఆకారం మారడం అనారోగ్యానికి సంకేమంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
సడెన్‌గా గోళ్లలో మార్పులు వస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. ఈ పరిణామాన్ని ఒక ముందు జాగ్రత్తగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రందించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలోనే గోళ్లలో వచ్చే మార్పులు.. వాటి వల్లే వచ్చే సమస్యలు ఏంటో గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్‌లోని డెర్మటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరంగా వెల్లడించారు.
గోళ్ల రంగు మార్పు వల్లే సమస్యలు:
పసుపు గోళ్లు: ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల గోర్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇది పసుపు నెయిల్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల వ్యాధి లేదా లింఫెడిమా వంటి తీవ్రమైన కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. పసుపు గోళ్లు సోరియాసిస్ లేదా థైరాయిడ్ వ్యాధికి కూడా సంకేతం కావచ్చు.
నీలి గోళ్లు (సైనోసిస్): రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటే గోర్లు నీలం రంగులోకి మారుతాయి. ఇది సీవోపీడీ లేదా గుండె జబ్బులు వంటి శ్వాసకోశ రుగ్మతల వల్ల ఇలా జరగొచ్చు.
గోళ్లపై నల్లటి చారలు లేదా మచ్చలు: గోరు కింద నల్లటి చారలు వస్తే ఇది మెలనోమాకు సూచన కావచ్చు. ఇది చర్మ క్యాన్సర్ యొక్క ప్రమాదకరమైన రూపం. ఈ చారలు ఇలాగే వ్యాప్తి చెందితే ప్రమాదం.
తెల్లటి లేదా లేత గోళ్లు: పాలిపోయిన లేదా తెల్లటి గోర్లు రక్తహీనత, కాలేయ వ్యాధి లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌ను సూచిస్తాయి. గోరులో ఎక్కువ భాగం తెల్లగా ఉంటుంది. గోరు చివర్లో గులాబీ రంగులో చిన్న మచ్చ ఉంటుంది. ఇది సాధారణంగా కాలేయ వ్యాధి లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధులకు సూచన.
ఆకృతి, ఆకార మార్పులు
గోళ్లలో పగుళ్లు ఏర్పటడం లేదా పెళుసుగా మారితే థైరాయిడ్ వ్యాధికి హెచ్చరిక. ముఖ్యంగా బాడీలో హైపోథైరాయిడిజాం, ఐరన్, బయోటిన్, జింక్ లోపాలకు సంకేతం కావచ్చు. గోళ్లు పైకి వంగి చెంచా ఆకారంలోకి మారితే ఐరన్ లోపం, రక్తహీనత, హిమోక్రోమాటోసిస్, గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. గోళ్లపై చిన్న చిన్న గుంటలు ఏర్పడితే అది సోరియాసిస్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉన్నట్లు. గోర్లు, చేతివేళ్లు పెద్దవిగా మారి అరచేతుల వైపు వంగితే దీర్ఘకాలిక శ్వాసకోశ సమ్యసలకు హెచ్చరిక
వైద్యుడిని ఎప్పుడూ సంప్రదించాలి:
పైన చెప్పినట్లుగా మీ గోళ్లలో ఏమైనా మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. గోరు రంగు, ఆకారం లేదా ఆకృతిలో నిరంతర మార్పులు వస్తే డాక్టర్‌ను కలవాలి. అలాగే గోళ్లపై ముదురు చారలు లేదా మచ్చలు, గోరు దగ్గర ఎరుపు, వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తే డాక్టర్ ను కన్సల్ట్ కావాలి. గోళ్ళలో కొన్ని మార్పులు ప్రమాదకరం కానప్పటికీ.. మరికొన్ని సమస్యలను ఇగ్నోర్ చేయకుండా వైద్యున్ని సంప్రదించడం చాలా అవసరమంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు.