
వాట్సాప్ ఈసారి ASKMetaAI ఫీచర్ను తీసుకొచ్చింది. వాబీటా ఇన్ఫో ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.25.23.24 కోసం వాట్సాప్ బీటాలో టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. మీకు ఏదైనా మెసేజ్ వస్తే దాని ఆప్షన్లో ASKMetaAI కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ మెసేజ్‌ను నేరుగా మెటా ఏఐ చాట్‌కు పంపొచ్చు. అక్కడ మీరు ఆ మెసేజ్‌కు సంబంధించిన ప్రశ్నను అడగొచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫేక్ మెసేజ్‌ల గురించి తెలుసుకోవచ్చు.
ఇదెలా పనిచేస్తుందంటే.. ఒక ఫార్వార్డ్ మెసేజ్ లేదా న్యూస్ ఏదైనా వస్తే అది సరైనదా? కాదా? అనేది తెలుసుకోవడానికి ఇతరులకు ఫార్వర్డ్ చేసేముందు ASKMetaAI పై క్లిక్ చేయాలి. దీంతో ఆ మెసేజ్ మెటా ఏఐ చాట్‌లో హైలైట్ అవుతుంది. మెటా ఏఐ దాని గురించి పూర్తి సమాచారాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. దాంతో క్లారిటీగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ సాయంతో ఫేక్ న్యూస్, రూమర్స్‌ను అడ్డుకోవచ్చు. వైరల్ అయ్యే మెసేజ్‌లు నిజమా? కాదా తెలుసుకోవచ్చు.