- రోజుకు రూ.500 నుంచి వెయ్యి ఇస్తామంటూ ఎర
- క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయించి రిమోట్ యాక్సెస్
- యూజర్ వాట్సాప్ డీయాక్టివ్, సైబర్ నేరగాళ్ల చేతిలో యాక్టివ్ డిజిటల్ స్కామ్‌తో అందినకాడికి మాయం చేస్తున్నరు
హైదరాబాద్, వెలుగు: వాట్సాప్ హ్యాకింగ్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. 'వాట్సాప్ రెంట్" కు లేదా "ఆటో ఎర్నింగ్" పేరుతో కొత్త రకం డిజిటల్ స్కామ్‌కు తెరతీశారు. వాట్సాప్ ఖాతాలను రెంటుకు ఇస్తే రోజూ ఆటో ఎర్నింగ్ ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయించి.. వాట్సాప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గ్రూపులోని సభ్యులతో పాటు ఇతర నంబర్లకు ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్ మోసాలు సహా అకౌంట్లు హ్యాక్ చేసేందుకు లింకులు, మెసేజ్‌లు పంపించి అందినంత దోచేస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో నమోదైన పలు కేసులను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. 'వాట్సాప్ రెంట్" లేదా "ఆటో ఎర్నింగ్" పేరుతో కాల్స్ వచ్చినా మెసేజ్‌లు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌బీ అధికారులు హెచ్చరించారు.
వాట్సాప్ అద్దెకు సోషల్ మీడియాలో క్యూఆర్
మొబైల్ యాప్స్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ యాప్స్ క్రియేట్‌చేయడంతో పాటు మ్యూల్ అకౌంట్లతో వందల కోట్లు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాట్సాప్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. స్కామర్లు సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు లేదా ఆన్‌లైన్ జాబ్ గ్రూపుల ద్వారా వాట్సాప్ యూజర్లను కాంటాక్ట్ అవుతున్నారు. వారు వినియోగించే వాట్సాప్ నంబర్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ఇవ్వాలని కోరుతున్నారు.
వాట్సాప్ ఖాతాలను అద్దెకు ఇస్తే రోజుకు రూ. 500 నుంచి రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఇలా ట్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను పంపిస్తున్నారు. కోడ్‌ను స్కాన్ చేయమని లేదా తాము పంపిన లింక్‌పై క్లిక్ చేయమని చెబుతున్నారు.
క్యూఆర్ స్కాన్‌తో వాట్సాప్ హ్యాక్
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే స్కామర్లు యూజర్ వాట్సాప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆ నంబర్‌ను వినియోగించి మోసాలకు పాల్పడుతున్నారు. గ్రూప్ సభ్యులను టార్గెట్‌చేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్స్‌తో పాటు ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్, పార్ట్ టైమ్ జాబ్స్ లాంటి లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేసిన వెంటనే మాల్‌వేర్ ఇన్‌స్టాల్‌అయ్యేలా ఏపీకే ఫైల్స్ జత చేస్తున్నారు. హ్యాక్ చేసిన అకౌంట్ల నుంచి అందినంతా దోచేస్తున్నారు.
యూజర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండడంతో బాధితులు కూడా సైబర్ నేరస్తులుగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదైన అనేక కేసుల్లో వాట్సాప్ రెంట్, ఆటో ఎర్నింగ్‌పేరుతో సేకరించినవేనని పోలీసులు పేర్కొన్నారు.
టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్కోండి
వాట్సాప్ ఖాతాకు రెంటు ఇస్తామని చెప్పడం అబద్ధం. కేవలం వాట్సాప్‌ను హ్యాక్ చేసేందుకే సైబర్ నేరగాళ్లు అద్దె పేరుతో ఆశ చూపుతున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే రిమోట్ యాక్సెస్ తీసుకుని మరో మొబైల్‌లో వాట్సాప్ యాక్టివేట్ చేస్తున్నారు. ఆ వెంటనే యూజర్ వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుంది. ఇలా వాట్సాప్ నంబర్లను సేకరించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడు తున్నారు. వాట్సాప్ సెట్టింగ్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్ పెట్టుకోవడం ద్వారా వాట్సాప్ ఎక్కడా యాక్టివేట్ కాకుండా చేయొచ్చు. కేవీఎం ప్రసాద్, డీఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో

