నేను కుర్చీ ఎక్కగానే.. పది కోట్ల వ్యాక్సిన్లు

నేను కుర్చీ ఎక్కగానే..  పది కోట్ల వ్యాక్సిన్లు

మాస్కులు, వ్యాక్సిన్ లు, స్కూళ్ల రీఓపెనే మాకు కీ గోల్స్  
నూరు రోజుల్లో కరోనాను కట్టడి చేస్తాం: జో బైడెన్  

వాషింగ్టన్: ‘‘మేం అధికారంలోకి రాగానే ఫస్ట్ 100 రోజుల్లో ప్రజలకు 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ లు ఫ్రీగా వేయిస్తాం. ఫస్ట్ నూరు రోజుల పాటు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని కోరతాం. స్కూళ్లను రీఓపెన్ చేసేందుకూ చర్యలు తీసుకుంటాం. ఈ మూడే మాకు అతి ముఖ్యమైన గోల్స్..’’ అని అమెరికా కాబోయే ప్రెసిడెంట్ జో బైడెన్ మంగళవారం మీడియాతో వెల్లడించారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు తాను ఇప్పటికే నియమించుకున్న హెల్త్ ఎక్స్​పర్టుల టీమ్ ఫస్ట్ రోజు నుంచే రంగంలోకి దిగుతుందన్నారు. అయితే స్కూళ్ల రీఓపెన్, టీచర్లు, స్టూడెంట్ల సేఫ్టీ కోసం కాంగ్రెస్ ఫండ్స్ విడుదల చేయాల్సి ఉంటుందని, రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బైడెన్ అన్నారు. ఇక మోడెర్నా, ఫైజర్ కంపెనీల నుంచి కరోనా వ్యాక్సిన్ ల కొనుగోలు కోసం ట్రంప్ సర్కార్ ఇప్పుడే స్పందించాలని కోరారు. అమెరికాలో కరోనా కేసులు ఇప్పటికే 1.5 కోట్లు, మరణాలు 2.86 లక్షలు దాటాయి. ఈ విపత్తును ప్రపంచ స్థాయి ఎక్స్​పర్టులు ఉన్న తమ హెల్త్ టీమ్ సమర్థంగా నివారిస్తుందని జో బైడెన్​ ఆశాభావం
వ్యక్తం చేశారు.

యూఎస్ సర్జన్ జనరల్ గా మళ్లీ వివేక్ మూర్తి 

ప్రముఖ ఇండియన్ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి (43) మళ్లీ యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను ఈ పదవికి ఎంపిక చేసినట్లు కాబోయే ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. మూర్తి తనకు అత్యంత నమ్మకమైన పబ్లిక్ హెల్త్, మెడికల్ అడ్వైజర్లలో ఒకరని ప్రశంసించారు. కరోనా నివారణలో కీలక సేవలు అందించారని బైడెన్ కొనియాడారు. యూఎస్ సర్జన్ జనరల్ గా మళ్లీ ఎంపిక కావడం పట్ల డాక్టర్ మూర్తి సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి అమెరికన్ కు సేవ చేసేందుకు డెడికేషన్ తో పనిచేస్తానని చెప్పారు. ఇండియాకు చెందిన ఓ పేద రైతు మనవడు ఒక దేశం మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే పదవికి ఎంపిక కావడం అనేది అమెరికా వంటి కొన్ని దేశాల్లోనే సాధ్యం అవుతుందన్నారు. కాగా మూర్తి తల్లిదండ్రులు 1970లలో కర్నాటక నుంచి అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. కాగా, యూఎస్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ కమిషన్డ్ కోర్ (పీహెచ్ఎస్ సీసీ) అధిపతిగా సర్జన్ జనరల్ ఉంటారు. ఫెడరల్ గవర్నమెంట్ కు పబ్లిక్ హెల్త్ విషయంలో లీడింగ్ స్పోక్స్ పర్సన్ గా పని చేస్తారు. నేరుగా అమెరికా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ కింద పని చేస్తారు. వివేక్ మూర్తి ఒబామా హయాంలో యూఎస్ సర్జన్ జనరల్ గా పని చేశారు. ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకొన్నారు.

అమెరికా ప్రెసిడెంట్​గా నేనే కొనసాగుతా: ట్రంప్

ప్రెసిడెంట్ ట్రంప్ మళ్లీ మాట మార్చారు. ఎన్నికల్లో తానే గెలిచానని, ప్రెసిడెంట్​గా కొనసాగుతానని అన్నారు. అమెరికాలో తయారయ్యే వ్యాక్సిన్లు ఫస్ట్ అమెరికన్లకు అందుబాటులోకి వచ్చాకే ఇతర దేశాలకు ఎక్స్​పోర్ట్ చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయన మంగళవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​ను జారీ చేశారు. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్​ను అమలు చేస్తామని, దేశంలోని కరోనా వ్యాక్సిన్లు తొలుత అమెరికన్లకే అందేలా చూస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం చేపట్టిన ఆపరేషన్ వార్ప్ సీడ్ విజయవంతం అయిందని చెప్పారు. కాగా, పెన్సిల్వేనియా స్టేట్ లో బైడెన్ గెలిచినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికేషన్ ను రద్దు చేయాలన్న రిపబ్లికన్ పార్టీ పిటిషన్​ను కూడా మంగళవారం సుప్రీంకోర్ట్ కొట్టేసింది. బైడెన్ ఎన్నికను ఈ నెల14న ఎలక్టోరల్ కాలేజ్ అఫీషియల్ గా డిక్లేర్ చేయనుంది. జనవరి 6 న కాంగ్రెస్ ఆమోద ముద్ర వేశాక.. 20వ తేదీన ఆయన ప్రమాణం చేయనున్నారు.