
- పెద్దపల్లిలో 6 నెలల కింద, జగిత్యాలలో రెండేళ్ల కిందే పూర్తి
- మెయింటెనెన్స్ భయంతో హ్యాండోవర్ చేసుకోని అధికారులు
- జిల్లా ఆఫీసులన్నీ అద్దె బిల్డింగుల్లోనే..
- కిరాయి కట్టలేదని తాళాలు వేస్తున్న ఓనర్స్
పెద్దపల్లి, వెలుగు: జిల్లాల్లో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించింది. కానీ వాటిని ఓపెన్ చేయడానికి మాత్రం సీఎం, మంత్రులకు తీరిక దొరకడం లేదు. కలెక్టరేట్ ల నిర్మాణం పూర్తయి ఆరు నెలలైనా ఓపెన్ చేస్తలేరు. కట్టిన బిల్డింగును కాంట్రాక్టర్ నుంచి హ్యాండోవర్ చేసుకుంట లేరు. మెయింటెనెన్స్ నెలకు రూ.3 లక్షలు పడుతుందనే భయంతోనే జిల్లా అధికారులు కట్టిన కలెక్టరేట్ బిల్డింగులను స్వాధీనం చేసుకుంటలేరు. జిల్లా స్థానిక ఆఫీసులన్నీ అద్దె బిల్డింగులలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదులు కావడంతో ఆఫీసు అవసరాల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ నిర్మాణం ఛాలెంజ్‌గా తీసుకొని నిర్మించి, ప్రారంభించినా దానివల్ల నాయకులు, అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో లేటైనా విమర్శలు రావద్దనే ఉద్దేశంతో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు రెండు కలెక్టరేట్లు ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
బిల్డింగులకు తాళాలేస్తున్నరు..
పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టరేట్‌తో సహా 34 జిల్లా ఆఫీసులను, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 25 దాకా అద్దె బిల్డింగుల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనుల మీద వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెంటెడ్ బిల్డింగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రెంట్ సమయానికి రాకపోవడంతో బిల్డింగ్ ఓనర్స్ సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేసుకుంటున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ ఆఫీస్రెంటు ఏడేళ్ల నుంచి ఒకే విధంగా ఉన్నదని, పెంచమని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకుంటలేరని ఆ బిల్డింగ్ ఓనర్ అధికారులను, సిబ్బందిని బయకు పంపి తాళం వేసుకొని వెళ్లిపోయాడు. దీంతో ఉన్నతాధికారులు తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి తాళాలు తీయించారు. ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటలేదు. పూర్తయిన కొత్త కలెక్టరేట్‌ను వెంటనే ఓపెన్ చేసి ఆఫీసులను తరలించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.
హ్యాండోవర్ చేసుకోలే..
కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకోవాలని కాంట్రాక్టర్లు కోరినా అధికారులు స్పందించడం లేదు. దీంతో ప్రతీనెల మెయింటెనెన్స్ సుమారు రూ.3 లక్షలు కాంట్రాక్టర్లే భరిస్తున్నారు. కలెక్టరేట్లలో పార్కులను తలపించేలా ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. రోజూ మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు, దాదాపు 21 ఎకరాల్లో ఉన్న క్యాంపస్‌ను శుభ్రం చేయడానికి సిబ్బందిని నియమించారు. ఈ భారమంతా కాంట్రాక్టర్లే భరించాల్సి వస్తుంది. ఈ ఖర్చంతా ఉంటుందనే, జిల్లా యంత్రాంగం బిల్డింగులను స్వాధీనం చేసుకోవడం లేదని తెలుస్తోంది.
పోయిన దసరాకే ఓపెన్ కావాల్సింది..
గతేడాదే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల క్యాంప్ ఆఫీసులను కలెక్టరేట్ క్యాంపస్‌లోకి తరలించారు. అయితే ఊహించని విధంగా ఓపెనింగ్ పెండింగ్ లో పడింది. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి సర్కార్ నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎస్సారెస్పీ క్యాంపును ప్రభుత్వం కలెక్టరేట్ నిర్మాణానికి ఎంపిక చేసింది. ఇందులోనే డీసీపీ కార్యాలయంతోపాటు పరేడ్ గ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టరేట్ నిర్మాణానికి దాదాపు రూ.50 కోట్లు మంజూరు చేసింది. 2017 అక్టోబర్ లో నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ సమావేశాలు కూడా జిల్లా కేంద్రంలో ఆడిటోరియంలు లేక ఎన్టీపీసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టరేట్ ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు చేయాలని ప్రజలు కోరుతున్నారు.