రాష్ట్రంలో బీసీల లెక్కింపు ఎప్పుడు?

రాష్ట్రంలో బీసీల లెక్కింపు ఎప్పుడు?
  • 2021లోనే ఉత్తర్వులు ఇచ్చిన సర్కారు
  • రూ.200 కోట్లు అవుతాయని బీసీ కమిషన్ నివేదిక   
  • ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి లేని కదలిక  
  • పలు రాష్ట్రాల్లో బీసీల లెక్కింపు పూర్తి 
  • ఇది పూర్తయితేనే లోకల్ బాడీ 
  • ఎలక్షన్లలో బీసీలకు రిజర్వేషన్లు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల లెక్కింపుపై ప్రభుత్వం అడుగు ముందుకు వేయడంలేదు. బీసీల లెక్కింపు చేపట్టేందుకు ప్రభుత్వం 2021లోనే ఉత్తర్వులు ఇచ్చింది. పోయిన ఏడాదే బీసీ గణన చేపడతారని భావించినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి కదలిక లేదు. దీంతో బీసీల లెక్కలు తీయకుండా నాన్చుతూ ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీసీ సంఘాల నుంచి వందల సంఖ్యలో విజ్ఞప్తులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. వాస్తవానికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణలోనూ బీసీల లెక్కలు తీయాల్సి ఉన్నది. ఇందుకోసం రూ.200 కోట్ల దాకా అవసరం అవుతాయని, అనుమతులు ఇవ్వాలని కోరుతూ బీసీ కమిషన్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ నుంచి నివేదికలు వెళ్లినప్పటికీ అవి ప్రగతిభవన్​లోనే మూలుగుతున్నాయి. బీసీ గణనపై గతంలోనే తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోనూ బీసీ కమిషన్ బృందం పర్యటించింది. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆ స్టడీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో బీసీ గణన ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల వర్తింపు ఉండనుంది. వచ్చే ఏడాదే సర్పంచ్​తో పాటు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ ఏడాదిలోనే బీసీ గణన చేపట్టి.. సుప్రీంకోర్టుకు వివరాలు సమర్పిస్తే దాని ఆధారంగా ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అందే అవకాశాలు ఉన్నాయి. 

వెల్ఫేర్ స్కీంలకూ అవసరం 

ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు 27శాతం పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే, దీన్ని బలపర్చేందుకు లేదా ఇంకా రిజర్వేషన్ పెంచాల్సి ఉంటే ఖచ్చితంగా బీసీ గణన చేయాల్సి ఉంటుంది. లేదంటే బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయి. ఎన్నికల్లో రిజర్వేషన్లకు మాత్రమే కాకుండా బీసీల సంఖ్యకు అనుగుణంగా వెల్ఫేర్ స్కీంలు అమలు చేసేందుకు కూడా బీసీ గణన తప్పనిసరి కానుంది. కానీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. బీసీల లెక్కింపును ఇంకింత ఆలస్యం చేసేలా కనిపిస్తున్నది. ఇంకో మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా కంప్లీట్​గా అసెంబ్లీ ఎన్నికల ప్రాసెస్ లో మునిగిపోతుంది. అందుకే బీసీ గణనపై సర్కారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

3 నుంచి 6 నెలల్లో కంప్లీట్​చేయొచ్చు

బీసీ కమిషన్, ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీల లెక్కింపు 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఇప్పుడు పూనుకుంటే ఆగస్టు కల్లా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కులాల వారీగా కాకపోయినా.. బీసీలుగా లెక్క తీసినా మేలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు లిస్ట్ ఆధారంగా కూడా తొందరగా పూర్తి చేసే చాన్స్ ఉందంటున్నారు. 

ఏపీలో ఏర్పాట్లు  

లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే, బీసీల లెక్కలు తప్పనిసరిగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. బీసీల లెక్కలు లేకుంటే రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించాలని మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అక్కడ రెండేండ్లు ఎన్నికలు వాయిదాపడ్డాయి. బీసీ జనాభా లెక్కింపు చేపట్టి సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాత 2022లో  ఎన్నికలు నిర్వహించారు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. అక్కడ కూడా రెండేండ్లుగా లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇప్పుడు బీసీ లెక్కల కోసం ప్రత్యేక కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనిచేస్తోంది. కర్నాటకలో వారం క్రితమే బీసీ గణన ముగిసింది. బీహార్ సర్కార్ కూడా బీసీ గణన చేపట్టింది. పక్క రాష్ట్రం ఏపీలోనూ బీసీల లెక్కింపు కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ బీసీ గణన విషయంపై తెలంగాణ సర్కారులోనే ఎలాంటి కదలిక లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.