
టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ఆసక్తికర విషయం వెల్లడించారు. 2008లో అప్పటి భారత వన్డే కెప్టెన్ ధోని తనను జట్టు నుంచి తప్పించడంతో అప్పుడే వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుదామనుకున్నానన్నాడు సెహ్వాగ్. కానీ సచిన్ వద్దని చెప్పడంతో తన నిర్ణయం మార్చుకున్నానన్నాడు ఈ నజాఫ్‌గఢ్ నవాబ్. ఓ ఇంటర్య్వూలో పదమ్‌జీత్ సెహ్రావత్‌తో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ట్రై-సిరీస్‌లో విఫలం కావడంతో ధోని నన్ను జట్టు నుంచి తప్పించాడు.
ఆ తర్వాత కొంతకాలం వరకు టీమ్‌లో చోటు దక్కలేదు. ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం లేనప్పుడు ఇక వన్డే క్రికెట్ ఆడటంలో అర్థం లేదని నాకు అనిపించింది. ఇక వన్డేలకు గుడ్ బై చెప్పాలనుకున్నా. రిటైర్మెంట్ కావాలనుకుంటున్న విషయాన్ని సచిన్‌తో చెప్పా. కానీ సచిన్ వద్దని చెప్పారు. 1999-2000లో తనకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైందని.. అప్పుడు తాను కూడా క్రికెట్‌ను విడిచిపెడదామనుకున్నా కానీ కొన్ని రోజులకు ఆ దశ నుంచి బయటపడ్డానని సచిన్ ఆయన ఎక్స్ పీరియన్స్ గురించి నాకు చెప్పారు.
ప్రస్తుతం నువ్వు కూడా అలాంటి సిట్యూయేషన్లోనే ఉన్నావని.. కానీ తొందర్లోనే ఈ గడ్డు కాలం నుంచి బయటపడతావని సచిన్ ధైర్యం చెప్పారు. ఆవేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. 1-2 సిరీస్‌ల ఆడి ఆ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించమని చెప్పారు. సచిన్ మాటతో రిటైర్మెంట్ ఆలోచనను విరమించుకున్నా. ఆ తర్వాత జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించా. పరుగుల వరద పారించా. ఆ తర్వాత 2011 ప్రపంచ కప్ కూడా ఆడాను. మేం టోర్నీ విజేతగా నిలిచాం’’ అని తన కెరీర్ లోని గడ్డు కాలం గురించి వెల్లడించాడు. టీమిండియా స్టార్ ప్లేయర్లలో ఒకరైన సెహ్వాగ్.. 2015 అక్టోబర్‌లో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.