రసూల్​పురా నాలా పనులు పూర్తయ్యేదెన్నడు?

 రసూల్​పురా నాలా పనులు పూర్తయ్యేదెన్నడు?

రెండు నెలలు దాటినా 60 శాతం కూడా కాలే

హైదరాబాద్, వెలుగు: స్ట్రాటజిక్‌‌ నాలా డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రాం (ఎస్‌‌ఎన్‌‌డీపీ) ఫేజ్–-2లో భాగంగా గ్రేటర్​లో బల్దియా చేపట్టిన నాలాలు, బ్రిడ్జిల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అనుకున్న టైమ్​లోగా అవి పూర్తి కాకపోవడంతో  ట్రాఫిక్ జామ్, డైవర్షన్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.   రసూల్ పురాలోని కరాచీ బేకరీ వద్ద పికెట్ నాలాపై బ్రిడ్జి పనులను  ప్రారంభించిన బల్దియా 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పింది.   పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకొని  ఏప్రిల్​ 21న అధికారులు పనులు మొదలు పెట్టారు.  బేగంపేట నుంచి ఎస్పీ రోడ్, మినిస్టర్‌‌ రోడ్, సికింద్రాబాద్‌‌ వైపు వెళ్లే ఏరియాల్లో 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సీపీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలు దాటినా ఇంకా పనులు కొనసాగుతుండంతో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు అలాగే ఉన్నాయి. పనులు పూర్తయ్యేందుకు మరో నెల రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. బ్రిడ్జి పనుల వల్ల ట్రాఫిక్ డైవర్షన్ చేయడంతో చిన్న వాన పడిన గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది.     

కంకర లేకపోవడంతో..

రసూల్​పురా నాలాపై బ్రిడ్జి పనులను తొందరగా పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. పనులు మొదలుపెట్టిన తర్వాత కంకర లేకపోవడంతో 3 వారాల పాటు నిలిచిపోయాయి.  ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ తగ్గించాలంటూ క్రషర్స్​ కంపెనీల నిర్వహకులు గత నెలలో  సమ్మెకు దిగడంతో  కంకర సప్లయ్ ఆగిపోయింది. దీంతో బల్దియా చేపట్టిన పనులకు కంకర దొరకక వాటిని నిలిపివేశారు.ఈ నెల 4 లోగా పూర్తికావాల్సిన రసూల్ పురా నాలాపై బ్రిడ్జి పనులు కంకర లేక ఆలస్యం కావడంతో జులై 15లోగా పూర్తిచేయాలని అధికారులు మరో టార్గెట్​ పెట్టుకున్నారు. కానీ ఆ తేదీలోగా పూర్తిచేస్తామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 

మిగతా ప్రాంతాల్లోనూ అంతే.. 

రసూల్​పురాతో పాటు  ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని నల్లపోచమ్మ టెంపుల్​వద్ద,  శంకర్ మఠ్ మార్కెట్​ దగ్గర కూడా నాలాపై బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు తర్వాత పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఆ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జిల నిర్మాణాలు జరుగుతున్న చోట వర్షాకాలం మొత్తం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదని వాహనదారులు అంటున్నారు. 

ట్రాఫిక్ పోలీసులకు టెన్షన్

మెయిన్ రోడ్లపై అవరసమైన చోట బ్రిడ్జిలు నిర్మిస్తామని బల్దియా అధికారులు.. ట్రాఫిక్​ పోలీసుల పర్మిషన్​ను కోరారు. అయితే ఇప్ప టికే పర్మిషన్ ఇచ్చిన దగ్గర సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో ఆయా  ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైతోంది. దీంతో వేరేచోట పర్మిషన్ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 3 బ్రిడ్జిలతో పాటు కర్మన్ ఘాట్ మెయిన్ రోడ్డుపై ఉన్న హనుమాన్ టెంపుల్​ వద్ద, రామంతా పూర్ టీవీ టవర్ సమీపంలోని చెరువు వద్ద మెయిన్ రోడ్డుపై బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, ఎర్రగడ్డ​ మెట్రో స్టేషన్​ సమీపంలోని బ్రిడ్జి పనులు,  సికింద్రాబాద్​లోని  మినిస్టర్ రోడ్, మల్కాజిగిరి, నాగోల్​లో బ్రిడ్జి, ఇతర ప్రాంతాల్లో పునర్నిర్మాణ పనుల కోసం ట్రాఫిక్ పోలీసులను జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ కావాలని అడిగారు. అన్నిచోట్ల ఒకేసారి పర్మిషన్ ఇస్తే వానల కారణంగా పనులు నిలిచిపోయే అవకాశం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు.   

ఇన్​టైమ్​లో పూర్తి చేయకపోతే ఎట్ల? 

45 రోజుల్లో రసూల్​పురా వద్ద నాలాపై బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని చెప్పి రోడ్డును క్లోజ్ చేశారు. ట్రాఫిక్ డైవర్షన్​తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నా.. ఇన్​టైమ్​లో అధికారులు పనులు పూర్తిచేయకపోతే ఎట్ల? డైవర్షన్ల కారణంగా చిన్న వాన పడినా గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది.  డైలీ ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది.

‌‌‌‌- శ్రీకాంత్, తార్నాక