రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తరు?

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తరు?

హైదరాబాద్, వెలుగు: యాసంగి పంటకు ఎకరాకు రూ.10 వేలు, రైతు భరోసా పథకం కింద రూ.15 వేల సాయం అందించడంలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్‌‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌‌లో వీరు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఖరీఫ్‌‌ సీజన్‌‌లో వ్యవసాయ పనులు జరుగుతున్నప్పటికీ రైతు భరోసా విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని నిరంజన్‌‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రూ.2 లక్షల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్‌‌ చేశారు. రైతు భరోసాకు అర్హులను ఇప్పటి వరకు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఓడిపోయిందన్న బాధ ఉందని, కానీ పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.